
కోడుమూరులో ప్ర‘జల’ కష్టాలు
కోడుమూరు రూరల్: నీళ్లు లేక హంద్రీ నది ఎండిపోవడంతో నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 45వేలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరికి మంచినీటిని అందించడం కోసం పంచాయతీ అధికారులు హంద్రీనదిలో ఎనిమిది బోర్లను వేశారు. వాటితో పట్టణంలోని ట్యాంకులకు నీటిని ఎక్కించి కాలనీల్లోని కుళాయిలకు వదులుతున్నారు. హంద్రీ నది ఎండిపోవడంతో బోర్లకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని కొండపేట, వెంకటేశ్వరనగర్, లక్ష్మీనగర్, వెంకటగిరి రోడ్డు, మోబీన్‌వీధి, మెయిన్‌బజార్, కుర్నీ నగర్‌లకు ఐదు రోజులకోసారి కుళాయిలకు నీటిని వదులుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టణంలో నీటి సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదముంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీనదికి విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్పందించని టీడీపీ నేతలు
తాము అధికారంలోకి వస్తే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి కోడుమూరుకు శాశ్వత నీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదు. కనీసం నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు సైతం చేపట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఎండిపోయిన హంద్రీ నది
అడుగంటిన భూగర్భ జలాలు
పనిచేయని మంచినీటి బోర్లు
ఐదు రోజులకోసారి నీటి సరఫరా

కోడుమూరులో ప్ర‘జల’ కష్టాలు