
అక్రమ రవాణా.. అడ్డుకుంటే ఒట్టు!
నాగలదిన్నె వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు
నందవరం: అధికార దర్పానికి తల వంచారో లేక మామూళ్ల మత్తుకు చేతులు ముడుచుకున్నారో? ఏమో? ఇక్కడ అధికారుల కళ్లెదుటే ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డదిడ్డంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పల్లెత్తు మాట అనడం లేదు. మచ్చుకు అభ్యంతరం కూడా చెప్పడం లేదు. నది నుంచి ఇసుకను తోడేస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కుర్చీలకు పరిమితమై నిర్లక్ష్యపు నీడలో నిద్దరోతున్నారు. మండలంలోని నాగలదిన్నె, నదికై రవాడి గ్రామాలను అనుకొని ఉన్న అడ్డదారుల్లో పచ్చముకలు మాఫియాగా ఏర్పడి తుంగభద్ర నదిపై వాలిపోతున్నారు. పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా దోచుకెళుతున్నారు. అక్రమ రవాణాతో విసుగెత్తిన గ్రామస్తులు ఎన్నోసార్లు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. ఆ రెండు గ్రామాల స్థావరాల నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఇక్కడి అధికారులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు తమ తీరు మార్చుకొని ఇసుక మాఫీయాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.