
విద్యార్థులకు తప్పిన ముప్పు
మహానంది: గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రైల్వే ఏఎస్‌ఐ హనుమంత రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కర్నూలు నుంచి కళాశాలకు వస్తున్నారు. అదే సమయంలో తిరుపతి నుంచి గుంటూరు వెళ్లే రైలు వస్తుండటంతో గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద గేటు మూశారు. అయితే కారు వేగంగా రావడంతో అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొని పట్టాల పైకి వచ్చి ఆగింది. వెంటనే గేట్‌మెన్ అప్రమత్తతతో దూరంగా వస్తున్న రైలు ఆగి పోయింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా రైల్వే గేటు దెబ్బ తినడంతో మరమ్మతులు చేపట్టారు. కాగా దాదాపు మూడు గంటల మేర మహానంది, గాజులపల్లి నుంచి మహానందికి వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి
చేరుకున్న కారు
గేట్‌మన్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం