
67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు.
17న పాణ్యంకు సీఎం రాక
పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ వెంచర్‌ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్‌డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
మైనారిటీ రుణాల దరఖాస్తుకు 25న ఆఖరు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిష్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు తమ వివరాలను htt pr://apbommr.apcfrr.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
దొర్నిపాడులో
41.6 డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు.
పడిపోయిన మిర్చి ధర
● క్వింటా ధర రూ.8వేలు మించని వైనం
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధరలు మరింత పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్న ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదనే ఉద్దేశంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో మిర్చి సాగు చేసి లాభాల పంట పండించుకున్న రైతులు 2024లో కోలుకోలేని విధంగా నష్టపోయారు. మిర్చి రైతులను ఆదుకుంటామని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేసినా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. 2024 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 95,478 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 22,390 ఎకరాల్లో మిర్చి సాగయింది. చీడపీడల సమస్యలు పెరగడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడులు కూడా పడిపోయాయి. ఇదే సమయంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2022లో మిర్చి ధర రికార్డు స్థాయిలో రూ.53 వేలకు పైగా పలికింది. 2023లో రూ.30 వేల ధర లభించింది. తాజాగా ఎరువు రకం ధర క్వింటాకు కనిష్టంగా రూ.2,299, గరిష్టంగా రూ.8,259 , సగటు ధర రూ.5,669 నమోదైంది. తేజా రకం ధర రూ.7,293 పలికింది.