కౌతాళం: నరసింహస్వామి జయంతి వేడుకల సందర్భంగా ఉరుకుంద దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఉదయం సుదర్శన హోమం పూర్తి చేశారు. తరువాత భక్తులు కూడా పాల్గొని హోమాలు చేపట్టారు. స్వామి వారి మూలవిరాట్‌ను వెండి ఆలంకరణలో ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చస్త్రశారు. దేవాలయపు డిప్యూటీ కమిషనర్ విజయరాజు, తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంక్
● పత్తికొండ విద్యార్థి ప్రతిభ
పత్తికొండ రూరల్: తెలంగాణ ఈఏపీసెట్‌లో పత్తికొండ విద్యార్థి కప్పట్రాళ్ల చెన్నకేశవ ప్రతిభ కనబరిచాడు. మొత్తం 160కి గాను 136.69 మార్కులు సాధించి 18వ ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయురాలు కల్యాణికుమారి, రమేష్ దంపతుల కుమారుడైన కప్పట్రాళ్ల చెన్నకేశవ పదో తరగతిలో 579 మార్కులు సాధించాడు. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ చదివి 991మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 206 ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఈఏపీసెట్‌లో 18వ ర్యాంకు సాధించిన కుమారుడిని తల్లిదండ్రులు అభినందించారు.
రేపు గోరుకల్లుకు ఎక్స్‌ఫర్ట్ కమిటీ రాక
పాణ్యం: మండల పరిధిలోని గోరుకల్లు జలాశయానికి మంగళవారం( రేపు) ఎక్స్‌ఫర్ట్ కమిటీ రానున్నట్లు ఇంజినీర్లు ఆదివారం తెలిపారు. ఇటీవల గోరుకల్లు జలాశయం కట్ట కుంగిన విషయం తెలిసిందే. అయితే పదేపదే కట్ట ఒకే చోట కుంగిపోవడంతో ఇంజినీర్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించింది. దీంతో ఈ కమిటీ 13న పర్యటించనుంది. డ్యామ్‌ను పరిశీలించిన తర్వాత తగు సూచనలు జారీ చేయనున్నారు.
ఆర్‌యూ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ భరత్‌కుమార్ పేర్కొన్నారు. 16వ తేదీ పునఃప్రారంభమవుతుందని తెలిపారు. పీజీ కళాశాలల ప్రిన్సిపాల్స్ షెడ్యూల్‌ను పాటించాలని పేర్కొన్నారు.
నేటి పరిష్కార వేదిక రద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు ఇన్‌చార్జి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కువ మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో ఉండడంతోనే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.10.25 లక్షల మోసం
కర్నూలు(సెంట్రల్): సెల్‌ఫోన్‌కు వచ్చిన చిన్న సందేశాన్ని చూసి ఒక వ్యక్తి మోసం పోయి రూ.10.25 లక్షలు పోగొట్టుకున్నాడు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కర్నూలులోని అమీన్ అబ్బాస్ నగర్‌లో ఉదయ్‌కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయన సెల్‌ఫోన్‌కు అలైస్ బ్లూ అనే సంస్థలో పెట్టుబడి పెడితే పెద్ద లాభాలు వస్తాయని మెస్సేజ్ వచ్చింది. దానిని చూసిన ఆయన తన వద్ద ఉన్న రూ.10.25 లక్షలను అందులో పెట్టాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని ఆదివారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైబర్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి(సోమ వారం)నుంచి మొదలై ఈ నెల 20వ తేదీ వరకు సాగనున్నాయి. ఇందుకు జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కమనీయం.. కల్యాణోత్సవం