
ఆలయానికి గోవు దానం చేసిన ముస్లిం
● కోవెలలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు
పత్తికొండ రూరల్: హోసూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీవేణుగోపాల స్వామి దేవాలయానికి ఓ ముస్లిం కుటుంబం గోవును దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకుంది. నూతన ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బెళడోణ రామనాథశాస్త్రి ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామస్తుడు గుడిసె నరసింహులు రూ.10లక్షల విరాళంతో నిర్మించిన ఆలయ ప్రధాన గోపురంపై కలశ ప్రతిష్ట మహోత్సవం కనుల పండువగా సాగింది. కులమతాలకు అతీతంగా భక్తులు తరలిరాగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ముల్లా నాదేల్లి బాషా గోవును స్వామివారి ఆలయానికి సమర్పించారు. ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా వచ్చి అర్చకులకు అప్పగించారు. వేద పండితులు గోవుకు ప్రత్యేక పూజలు చేసి స్వీకరించారు.

ఆలయానికి గోవు దానం చేసిన ముస్లిం