
మధ్యంతర భృతి ప్రకటించాలి
నంద్యాల(న్యూటౌన్): 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, కేవీ శివయ్య, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం గందరగోళ పరిస్థితుల ను సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ విధానాలతో పాఠశాల విద్యకు నష్టం కలుగుతుందన్నారు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 14న విజయవాడలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం డీఆర్‌ఓ రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు భాస్కరరెడ్డి, జాకీర్‌హుసేన్, మధు, రమేష్, శైలజ, రాములమ్మ, రమాబాయి, సునిత తదితరులు పాల్గొన్నారు.