
స్నేహితులను కాటేసిన కరెంట్
● పెళ్లి డెకరేషన్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతం ● ఇద్దరు యువకుల మృత్యువాత ● తక్కువ ఎత్తులో విద్యుత్ లైన్ వెళ్లడంతో ప్రమాదం ● ఉరుకుందలో విషాదం
కౌతాళం: రెక్కల కష్టంతో కుటుంబాలను పోషిస్తున్న ఇద్దరు స్నేహితులను మృత్యువు కబళించింది. అప్పటి వరకు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు సహాయం అందించుకుంటూ పనులు చేస్తున్న వారిని కరెంట్ కాటేసింది. ఈ విషాద ఘటన ఉరుకుంద గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన కట్టవీధి సునీల్ అలియాస్ నాని (24), అదే కాలనీకి చెందిన మహేంద్ర (23) ఇద్దరు స్నేహితులు. ప్రతి రోజు ఇద్దరు టెంట్ హౌస్‌లో పని చేస్తూ శుభకార్యాలకు టెంట్లు ఏర్పాటు చేసేవారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద పెళ్లికి సంబంధించిన టెంటు వేసేందుకు వెళ్లారు. కాగా ప్రమాదవశాత్తూ ఇనుప కడ్డీకి పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో సునీల్, మహేంద్ర విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్వంతమయ్యారు. మృతుల కుటంబీకుల ఫిర్యాదు మేరకు కౌతాళం సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు సునీల్‌కు భార్య వనిత, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వనిత రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. మహేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. చేతికొచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు తిక్కమ్మ, నాగన్న బోరున విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరూ అంటూ రోదించారు.

స్నేహితులను కాటేసిన కరెంట్

స్నేహితులను కాటేసిన కరెంట్