
ప్రభుత్వాసుపత్రిలో రోగి అదృశ్యం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగి కనిపించకుండా పోయాడు. కృష్ణగిరి మండలం బాపనదొడ్డికి చెందిన చిన్న ఆంజనేయులు (80)కు ఆయాసం ఉండటంతో కుమారుడు బీరప్ప బుధవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. తండ్రిని ఎమర్జెన్సీ వార్డు వద్దే ఉంచి స్కానింగ్ రిపోర్టు తీసుకునివచ్చే సరికి కనిపించకపోవడంతో ఆయన చుట్టు పక్కల గాలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో చెరుకులపాడు, బాపనదొడ్డి, చెట్లమల్లాపురం తదితర గ్రామాల్లో రాత్రి అంతా వెతికారు. చిన్న ఆంజనేయులు ఆచూకీ కానరాకపోవడంతో గురువారం ఉదయం కర్నూలులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన తండ్రి కనిపించడం లేదని బీరప్ప ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ తెలిసిన వారు 96664 96775, 70320 85182కు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఏసీబీ కేసులో షరాఫ్ గోపాల్ ఉద్యోగం తొలగింపు
కర్నూలు(సెంట్రల్): ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షరాఫ్‌గా పనిచేస్తున్న గోపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఎం.చెన్నకేశవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఏపిల్ర్ 27వ తేదీన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏక కాలంలో ఏసీబీ దాడి చేసి కల్లూరులో 15 మంది డ్యాకుమెంట్ రైటర్లు, సిబ్బంది నుంచి రూ.55,660, కర్నూలులో 12 మంది డ్యాకుమెంట్‌రైటర్లు ఇతర ఉద్యోగుల నుంచి రూ.40,470 అనధికార నగదు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో కల్లూరు అప్పటి సబ్ రిజిస్ట్రార్ అరుణ్‌కుమార్, కర్నూలులో షరాఫ్‌గా పనిచేస్తున్న గోపాల్‌లపై కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో షరాఫ్ గోపాల్‌పై అభియోగాలు వాస్తవమని తేలడంతో విధుల నుంచి తొలగించాలని డీఐజీని ఆదేశించింది.
ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలు
కర్నూలు (హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వైద్య పరీక్షల్లో మొదటి రోజు 72 మందికి వైద్యులు పరీక్షించి నివేదికలు ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ధన్వంతరి హాలులో ఆర్థోపెడిక్ మినహా మిగిలిన విభాగాల వారు ఆయా విభాగాల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.