గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తాం
వెల్దుర్తి: గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని, ఇరువర్గాలు సంయమనంతో ప్రశాంత వాతావరణంలో కలసిమెలసి జీవించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ అన్నారు. మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లెలో పది నెలల తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు గ్రామానికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో జిల్లా ఎస్పీ మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, వెల్దుర్తి, కర్నూలు వన్‌టౌన్, ఎస్బీ సీఐలు మధుసూదన్‌రావ్, రామయ్యనాయుడు, తేజోమూర్తి, వెల్దుర్తి, కృష్ణగిరి, ఎస్బీ ఎస్‌ఐలు అశోక్, మల్లికార్జున, ఖాజావలితో కలిసి ఎస్పీ వీధివీధినా తిరిగారు. గ్రామానికి చేరుకున్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఇకపై ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. టీడీపీ నాయకుడు సుబ్బరాయుడుతో మాట్లాడుతూ గ్రామంలో ఇకపై ఎలాంటి అల్లర్లు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అనుచరులను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, హద్దు మీరితే కేసులు తప్పవన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పికెట్ నిర్వహించాలని, ఇరువర్గాల నాయకులతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
బొమ్మిరెడ్డిపల్లెలో పర్యటించిన జిల్లా ఎస్పీ


