ప్రత్యేక క్యాంపులైనా పరిష్కారాలు చూపుతాయా?
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ సమస్యలను పరిష్కరిస్తారంటే అక్కడకు వెళ్లి అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే గ్రామసభలు, రెవెన్యూ సదస్సులు, ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వచ్చినా పరిష్కారాలు కావడంలేదు. ఈ క్రమంలో డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లోనైనా అర్జీలు ఇస్తే పరిష్కారం అవుతాయన్న ఆశ రైతుల్లో ఉంది. అయితే అధికారులు ఏమి చేస్తారో తెలియడంలేదు. ఎప్పటిలాగే అర్జీలను తీసుకొని బుట్టదాఖలు చేస్తారా లేదంటే పరిష్కారాలు చూపుతారా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో స్వయంగా ఆయనే చేతులు ఎత్తి వేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మరోసారి అర్జీల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చుక్కల భూములు, అడంగల్ సమస్యలు, నిషేధిత జాబితాలోని భూముల సమస్యలపై అర్జీల స్వీకరణ డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ మధ్య అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నామని, వాటిలో అర్జీలు ఇస్తే పరిష్కారాలు చూపుతామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా పరిష్కరించకపోగా..మళ్లీ ఇప్పుడు అర్జీలు ఇవ్వాలని కోరడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇన్నాళ్లు ఇచ్చిన అర్జీలు బుట్టదాఖలేనా?
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2024 అక్టోబర్‌లో గ్రామ సభలు, 2025 జనవరిలో రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఇందులో గ్రామ సభల్లో దాదాపు 18 వేల అర్జీలు రైతుల నుంచి తమ భూములకు సంబంధించి వచ్చాయి. అలాగే రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 6 వేల అర్జీలు వచ్చాయి. అయితే వీటికి ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు చూపారు. ఈ క్రమంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల వెంట తిరగడం రైతులకు పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో గ్రామసభలు, రెవెన్యూ సదస్సులను ఎందుకు నిర్వహించారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో వాటిలో వచ్చిన అర్జీలన్నీ బుట్టదాఖలేనా అన్న ప్రశ్న వస్తోంది. ఇందుకు ఎవరూ సమాధానం చెప్పడంలేదు, ప్రత్యేక క్యాంపుల్లో అర్జీ పెట్టుకుంటే పరిష్కరిస్తామని చెబుతున్నారు.
పీజీఆర్‌ఎస్‌లో
రెవెన్యూ సమస్యలే అధికం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో రెవెన్యూ సమస్యలే అధికం. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 61,108 అర్జీలు రాగా, అందులో 52,794 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు చూపారు. అలాగే 2912 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 20,757 అర్జీలు ఉన్నాయి. ఇందులో 16,753 అర్జీలను పరిష్కరించామని, 1,816 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపారు. ఈ నివేదికలను బట్టి పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యల్లో రెవెన్యూ సమస్యలే అధికమని అర్థమవుతుంది. ఈ క్రమంలో పరిష్కరించిన సమస్యలే అధికంగా ఉన్నట్లు అధికారులు నివేదికలో పొందుపరచారు. అయితే బాధిత రైతులు మాత్రం ఎవరూ పరిష్కారమైనట్లు చెప్పడంలేదు.
ఎన్ని అర్జీలు ఇచ్చినా
పరిష్కారం శూన్యం
మరోసారి 26 నుంచి
31 వరకు క్యాంపుల నిర్వహణ
ఇప్పటికే రెవెన్యూ సదస్సులు,
గ్రామసభల పేరుతో అర్జీల స్వీకరణ
ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో
అర్జీలు ఇచ్చిన ప్రజలు
వాటికి పరిష్కారం చూపకుండా
బుట్టదాఖలు
బాధితుల ఆవేదన
ప్రత్యేక క్యాంపులైనా పరిష్కారాలు చూపుతాయా?


