జనవరి 2న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): రీసర్వే జరిగిన గ్రామాలకు సంబంధించిన రైతులకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్ధేశించిన రోజున రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని ముందుగానే రెవెన్యూ అధికారులు తెలియజేస్తారని, ఆ రోజున వెళ్తే సరిపోతుందని ఆమె సూచించారు.
మెంటార్లుగా జిల్లా, మండల స్థాయి అధికారులు
కర్నూలు సిటీ: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉన్నత పాఠశాలలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని 361 ఉన్నత పాఠశాలలకు నియమించిన మెంటార్లతో నేటి(శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు సునయన ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది పరీక్షల ఫలితాల పెంపునకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెంటార్లకు కేటాయించిన పాఠశాలల్లో పునరావృత బోధన, పునశ్చరణ, సాధన పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడం, క్రమ శిక్షణ పెంపొందించడం, పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు.
పింఛన్లకు నిధుల మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): జనవరి నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రీ వెరిఫికేషన్‌లో అనర్హత వేటు వేస్తూ నోటీసులు అందుకున్న దివ్యాంగులు అప్పీల్ చేసుకోవడంతో పునఃపరిశీలన జరుగుతోంది. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అందరికీ పింఛన్లను కొనసాగించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 4,50,865 పింఛన్ల పంపిణీకి రూ.196.64 కోట్లు మంజూరయ్యాయి.
సీనియర్ అకౌంటెంట్ సస్పెన్షన్
కర్నూలు(అగ్రికల్చర్): రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డోన్ సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ లక్ష్మానాయక్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. ఏసీబీ కేసులో పట్టుబడి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నట్లు నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి నుంచి రిపోర్టు అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గురువారం విలేకర్లకు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా అంతటా డ్రంకెన్ అండ్ డ్రైవ్‌ను విస్తృతం చేస్తున్నామని, తనిఖీల్లో పట్టుబడితే నెల రోజుల పాటు జైలుశిక్ష తప్పదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 9,025 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నా రు. ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేయడంతో పాటు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
దక్షిణ భారత
సైన్స్ ఫేర్‌కు జహీర్
ఆత్మకూరు: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జహీర్ ప్రతిభ చాటి దక్షిణ భారత సైన్స్ ఫేర్‌కు ఎంపిౖకైనట్లు హెచ్‌ఎం దేవానందన్ గురువారం తెలిపారు. విజయవాడలో ఈనెల 23 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా ప్రదర్శనలో జహీర్ ఓవర్‌లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టం ఇన్ టూ వీలర్ (ద్విచక్ర వాహనాల్లో అధిక బరువును గుర్తించి హెచ్చరించే వ్యవస్థ) అనే నమూనాను ప్రదర్శించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ప్రాజెక్టు జనవరి 19 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణ భారత సైన్స్ ఫేర్‌లో ప్రదర్శించడానికి ఎంపికై ందన్నారు.


