భక్తులకు బిల్లు ఇవ్వకుండా..
● దేవస్థాన మల్లికార్జున సదన్ కౌంటర్ ఉద్యోగి నిర్వాకం
శ్రీశైలంటెంపుల్: స్థానిక మల్లికార్జున సదన్ ఉద్యోగి దేవస్థానం ఆదాయానికి గండి కొట్టారు. ఉత్తరాఖాండ్‌కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వీరు బుధవారం రాత్రి వసతి కోసం మల్లికార్జున సదన్ వద్దకు వచ్చి డార్మెంటరీ కావాలని అడిగారు. కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తన వక్రబుద్ధికి పని చెప్పాడు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుము రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1,750 తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి, వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి వారి వద్ద నుంచి రూ.2 వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్నట్లు సమాచారం. హిందీ భక్తులు బెడ్ తీసుకుని రాత్రి నిద్రపోయి ఉదయం ఫ్రెష్‌అప్ కూడా అయ్యారు. రాత్రి కౌంటర్‌లో విధులు నిర్వహించిన వ్యక్తి గురువారం ఉద యం తన విధులు ముగించుకుని మరో ఉద్యోగికి విధులు అప్పగించారు. ఉదయం 10 గంటల సమయంలో డార్మెంటరీ తీసుకునేందుకు భక్తులు వచ్చా రు. ఖాళీగా ఉండడంతో డార్మెంటరీని బిల్లు కొట్టి ఇతర భక్తులకు ఇచ్చాడు. అయితే అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ బెడ్ల మీద ఇతరులు ఉండడంతో కౌంటర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో కంగుతిన్న కౌంటర్ సిబ్బంది విచారించగా రాత్రి విధులు నిర్వహించిన ఉద్యోగి బిల్లు కొట్టలేదని తెలిసింది. దీంతో వారిని బయటికి పంపించి, బిల్లు తీసుకున్న వారిని డార్మెంటరీలోకి అనుమతించారు. ఈ విషయం తెలుసుకున్న రాత్రి విధులు నిర్వహించిన కౌంటర్ ఉద్యోగి హుటాహుటిన మల్లికార్జున సదన్ వద్దకు చేరుకుని హింది భక్తులతో బతిమిలాడుకుని, తనపై ఫిర్యాదు చేయకుండా వారిని ఒప్పించి, వారి డబ్బులు తిరిగి చెల్లించినట్లు సమాచారం. అయితే వసతి విభాగంపై ఉన్నతాధికారి, వసతి విభాగపు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


