
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గుడిసె
హొళగుంద: ఓ పేద రైతు కష్టం బూడిదపాలైంది. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. హొళగుంద మండలం కోగిలతోట గ్రామంలో శుక్రవారం పైగేరి దేవేంద్రకు చెందిన గుడిసెకు నిప్పంటుకుని ఇంట్లో దాచి ఉంచిన రూ. 2లక్షల నగదు, ఆహార ధాన్యాలు, ఇంటి సామగ్రి కాలిపోయాయి. రూ. 5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు...పైగేరి దేవేంద్ర తన మూడు ఎకరాలతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని భార్య భూమిక టైలరింగ్ పని చేస్తూ ఇద్దరి కుమారులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. పెద్దగా ఆస్తిపరులు కాకపోవడంతో గుడిసెలో నివాసం ఉంటున్నారు. తన చిన్న అన్న ఇంట్లో శుభకార్యం ఉండడంతో శుక్రవారం ఉదయం దేవేంద్ర భార్యాపిల్లలతో సహా వెళ్లాడు. మధ్యాహ్యం ఉన్నట్టుండి గుడిసెకు నిప్పంటుకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం దేవేంద్రకు తెలిసి అక్కడికి చేరుకునే లోపే గుడిసె పూర్తిగా కాలిపోయింది. పెద్ద అన్న వారం రోజు క్రితం బ్యాడిగిలో మిరప అమ్మితే వచ్చిన రూ.2 లక్షల నగదును దేవేంద్రకు ఇచ్చాడు. గుడిసెలో దాచి ఉంచిన ఈ నగదు కాలి బూడిదైంది. అలాగే బియ్యం బస్తాలు, కుట్టుపనికి ఇచ్చిన దస్తులు, ఇంటి సామగ్రి కాలి పోయాయి. ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు తెలిపారు. సర్వం కోల్పోయానని, తనను ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని దేవేంద్ర కోరారు.
అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం
కాలిపోయిన రూ.2 లక్షల నగదు
రూ.5 లక్షల ఆస్తి నష్టం