కంట్రోల్ రూమ్ నంబర్ ఇదే
మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయన్న వాతావరణశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ నేడు విద్యాసంస్థలకు సెలవు
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
జలమయమైన హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలి
చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారడంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కాగా బుధవారం జిల్లా అంతటా ఎడతెరిపి లేని వర్షం కురవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో స్వయంగా మాట్లాడి అప్రమత్తం చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
జనాల అవస్థలు
తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేని వర్షం కురవటంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వానలో తడిసి వెళ్లాల్సి వచ్చింది. ఉదయం నుంచి భారీ వర్షం కురవటంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలెక్టర్ డీకే బాలాజీ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురువారం కూడా అదే పరిస్థితులు ఉండనున్న నేపథ్యంలో అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
రైతులకు కాస్త ఊరట..
రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కాసింత ఊరట కలిగింది. జిల్లాలో 1,60,655 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా 1,47,379 హెక్టార్లలో వరిసాగు జరిగింది. అయితే గత రెండు నెలలుగా సాగునీరు రైతులకు అందకపోవటంతో ప్రత్యామ్నాయ వనరులు ఉపయోగించి సాగు చేస్తున్నారు. అయితే ఈ వర్షం పంటలు ఎండి పోకుండా ఉపయోగపడుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో ఆలస్యంగా సాగు చేస్తుంటారని అలా నాట్లు వేసే రైతులకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని అంటున్నారు. ఉద్యానపంటలకు సంబంధించి జిల్లాలో అరటి, పసుపు, కూరగాయల పంటలు ఈ వర్షం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఇదే వర్షం మరో రెండు, మూడు రోజులు పాటు కురిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
గుడివాడలో అత్యధిక వర్షపాతం
జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 22.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుడివాడ మండలంలో 48.5 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నాగాయలంక మండలంలో 10.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలంలో 37.5 మిల్లీమీటర్లు, మచిలీపట్నం నార్త్ 33.1, పెదపారుపూడి 31.0, తోట్లవల్లూరు 30.8, నందివాడ 28.3, పెడన 26.8, మచిలీపట్నంసౌత్ 26.7, బాపులపాడు 26.2, ఉయ్యూరు 25.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బంటుమిల్లి మండలంలో 24.2 మిల్లీమీటర్లు, కృత్తివెన్ను 24.1, ఘంటసాల 21.7, ఉంగుటూరు 20.6, పామర్రు 20.4, గూడూరు 18.7, కంకిపాడు 18.0, చల్లపల్లి 17.5, పమిడిముక్కల 16.7, పెనమలూరు 16.4, మొవ్వ 15.4, మోపిదేవి 14.2, కోడూరు 14.1, గన్నవరం 13.3, అవనిగడ్డ 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నంబరు 08672–252399కు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం అత్యవసర పరిస్థితులను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలిపేందుకు సిబ్బందిని నియమించామన్నారు.


