వాయుగుండం నేపథ్యంలో వణుకుతున్న విజయవాడ నగరంలో రెండున్నర లక్షలకుపైగా జనం కొండలపైనే ఆవాసం భారీ వర్షంకురిస్తే జారిపడిన కొండచరియలు ప్రాణాలు పోతున్నా పట్టని ప్రభుత్వం
వర్షం పడితే భయమే..
కొండ ప్రాంతంలో బిక్కుబిక్కు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేవి నగరానికి అన్ని వైపులా కనిపించే కొండలే. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న కొండ ప్రాంతవాసులు వర్షం పడితే ఎక్కడ ఏ ప్రమాదం వినాల్సి వస్తుందోననే ఆందోళనతో కాలం గడపాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యమవుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
బెంబేలెత్తుతున్న ప్రజానీకం
వాతావరణ శాఖ బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలని ప్రకటించడంతో కొండ ప్రాంత నివాసితులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఆయా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు భయంతో నిద్ర లేకుండా పోయింది. కొండలన్నీ నానుతుండటంతో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలన్నీ మీడియాలో పదేపదే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింతగా భయపడుతున్నారు.
రెండున్నర లక్షలకుపైగా జనం
విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో మొన్నటి వరకూ 64 డివిజన్‌లు కొనసాగాయి. తాజాగా అవి 86కు పెరిగాయి. అయితే పాత డివిజన్‌లలో సుమారు 20 డివిజన్‌లో పూర్తిగా కొండ ప్రాంతాలను కలుపుకొని ఉన్నాయి. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆయా కొండ ప్రాంతాల్లో సుమారుగా రెండున్నర లక్షలకుపైగా ప్రజలు నివాసాలను ఏర్పరచుకొని జీవిస్తున్నారు. అందులో అత్యధికంగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట, కొత్తపేట, ఆంజనేయవాగు, చిట్టినగర్, లంబాడీపేట, పాలప్రాజెక్ట్, కబేళా, రామరాజ్యనగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాలకు సమీ పంలో ఉన్న కొండలపై అత్యధికంగా నివాసాలు ఉన్నాయి.
తరచూ ప్రమాదాలు
నగరంలోని మూడు నియోజకవర్గ పరిధుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా గత ఏడాది మొంథా తుపాను నేపథ్యంలో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే గొల్లపాలెంగట్టు, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండ చరియలు జారిపడ్డాయి. రిటైనింగ్ వాల్స్ దెబ్బతిని కిందకుజారాయి. అలాగే తూర్పు నియోజకవర్గంలోనూ కొండపైన రిటైనింగ్ వాల్స్ జారాయి. గడిచిన ఆరు మాసాలుగా ప్రతి నెలలోనూ ఒకటి రెండు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వినాయకచవితి పర్వదినానికి ముందు రోజు 45వ డివిజన్‌లో కొండబడి సమీపంలో కొండచరియలు జారిపడ్డాయి. అదే రోజు 49వ డివిజన్‌లోనూ కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ రెండు సంఘటనలలో ప్రాణనష్టం జరగకపోయినా వారు పూర్తిగా రోడ్డుపాలైన పరిస్థితి.
ప్రాణాలు పోతున్నా పట్టని ప్రభుత్వం
నగరంలోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు పోతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని స్థానిక నివాసితులు వాపోతున్నారు. ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లోనూ ఉన్న కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ జారిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు స్థానిక ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా మొఘల్‌రాజుపురంలోని పలు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయి తీరని వ్యథను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై స్థానికులు మండి పడుతున్నారు.
కౌన్సిల్ ఆమోదం పొందినా..
నగరంలోని పలు కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి నగరపాలకసంస్థ కౌన్సిల్‌లో పలు అంశాలు ఆమోదం పొందినప్పటికీ అధికారులు వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు మాజీ కార్పొరేటర్‌లు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పనులు ప్రారంభించినా వాటిని మధ్యలో నిలిపివేశారని ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లు చెబుతున్నారు.
ప్రభుత్వ విధానాలతో అధికారులు ఏ పనులూ చేపట్టడం లేదు. నగరంలో చాలా డివిజన్లలోని కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి ఆమోదం ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కావటం లేదు. టెండర్లు పిల వటం లేదు. ఎప్పుడు వర్షం పడినా అప్పుడు బిక్కుబిక్కుమంటూ కొండ ప్రాంత ప్రజానీకం వణికిపోతున్నారు.
– షేక్ హాయత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వైఎస్సార్ సీపీ


