ముసురుకున్న కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ముసురుకున్న కష్టాలు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం గన్నవరంలో అత్యధిక వర్షపాతం

వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం ఈదురు గాలులతో పలు చోట్ల నేలకూలిన చెట్లు కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలు

కడలి

కల్లోలం

వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం

బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 110.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గన్నవరం మండలంలో 168.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉంగు టూరు 164.6, గుడివాడ 143.2, అవనిగడ్డ 126.2, బాపులపాడు 125.6, నందివాడ 124.6, పామర్రు 116.8, గూడూరు 114, కంకిపాడు 110.4, కోడూరు 108.6, పెడన 99.6, ఉయ్యూరు 99.4, పెనమలూరు, పమిడిముక్కలు 96.8, గుడ్లవల్లేరు 95.8, ఘంట సాల 95.2, కృత్తివెన్ను 90.2, బంటుమిల్లి 88.8, చల్లపల్లి 88.4, మచిలీపట్నం సౌత్‌, నార్త్‌ 85.2, తోట్లవల్లూరు 83.2, మొవ్వ, మోపిదేవి 82.6, పెదపారుపూడి 81.8, నాగాయలంకలో 58.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాలో గురువారం కూడా కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా తెరిపివ్వని భారీ వర్షాలకు పలు చోట్ల పల్లపుప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. గన్నవరం, అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. రెండో రోజు భారీ వర్షసూచన ఉండటంతో కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్‌ బాలాజీ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.

వర్షాలతో ఇబ్బందులు

గురువారం కుండపోతగా వర్షం కురవటంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాలకు వెళ్లే సిబ్బంది వర్షంలో తడవాల్సి వచ్చింది. అవనిగడ్డ గ్రామం ఒకటో వార్డులోని లంక మాన్యం, సింహాద్రి కాలనీ మురుగు కాలువలు పొంగిపొర్లాయి. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో కూడా డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. మోపిదేవి గ్రామంలో ఈదురుగాలుల వల్ల చెట్టుకొమ్మ విరిగి విద్యుత్‌ వైరుపై పడింది. వైర్లను చేతితో పట్టుకుని పైకి లేపుతుండగా విద్యుదాఘానికి గురై దారపురెడ్డి విజయసామ్రాజ్యం (52) మృతి చెందింది. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలోని వెన్ననపూడి, దండిగనపూడి, పోలుకొండ, ఇలపర్రు గ్రామాలతో పాటు గుడివాడ మండలంలోని గుంటకోడూరు, గొల్వెపల్లి, సిరిచింతల గ్రామాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెడన నియోజకవర్గంలో పెడన – గుడివాడ రహదారిపై ఈదురుగాలులకు వృక్షం విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలస్యంగా సాగు చేసిన పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు, లంకపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై బుడమేరు నీటి ప్రవాహం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యగా రాకపోకలు నిలిపివేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ నిర్వహణకు నియమించిన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

రెండు రోజులుగా భారీ వర్షాలు కురవటంతో ఆలస్యంగా సాగు ప్రారంభించిన పంట పొలాలు ముంపునకు గురైతే నీరు తోడుకునే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే సాగు చేసిన పంట పొలాలకు వర్షం ఊరటనిస్తుందని పేర్కొ న్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి అరటి, పసుపు, కూరగాయల పంటలకు ఎటువంటి నష్టం లేదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

నిలిచిన వేట

కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు తమ వేట పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో గంగపుత్రులు వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.

నేడు విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ ఆదేశాలను అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అమలు చేయాలని స్పష్టంచేశారు.

కోడూరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో మండలంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని రాకాసి అలలు సుమారు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతూ భయందోళన కలిగించాయి. బీచ్‌ పరిస రాలు మొత్తం సముద్రపు పోటుతో నిండిపోయాయి. సముద్రం నీరు సుమారు కిలో మీటరు మేర ముందుకు చొచ్చుకొచ్చింది. డాల్ఫిన్‌ భవనంతో పాటు అటవీ అధికారులు నిర్మించిన గుడారాలు చుట్టూ కూడా సముద్రం నీరు చేరింది. పవిత్ర కృష్ణా సాగర సంగమం వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం నుంచి సంగమం వరకు ఇసుక తిన్నెలు భారీస్థాయిలో కోతకు గురయ్యాయి. సముద్ర హోరుతో తీరప్రాంత భీకరంగా మారింది. అటవీ అధికారులు తీరం గేట్లను మూసి వేశారు. కరకట్ట వద్ద గేట్లకు తాళాలు వేసి పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరో రెండు రోజులు బీచ్‌ గేట్లు మూసే ఉంటాయని, పర్యాటకులు తీరానికి రావద్దని స్పష్టం చేశారు. గేటు వద్ద మైరెన్‌, అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement