జి.కొండూరు: మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లుగా మరుగున పెట్టిన ప్రజా ప్రతినిధులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఎత్తిపోతల పథకంలో మోటార్లు పని చేయకపోయినా ఆయకట్టు రైతులకు పుష్కలంగా నీరందిస్తున్నట్లు అధికారులు ఆడుతున్న కవరింగ్ డ్రామాలు రైతులను మరింత ఆందోళనలో పడేస్తోంది. ఏడాది మొత్తం నీరు అందుబాటులో ఉండి కూడా ఎత్తిపోయలేకపోవడంతో ఆయకట్టు రైతాంగం నరకయాతన పడుతున్నారు. తారకరామ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువపై ఉన్న నాలుగు పంపుహౌస్‌లలో రెండు పంపుహౌస్‌లు పూర్తిగా మూతపడగా రెండు పంపుహౌస్‌లలో ఉన్న ఎనిమిది మోటార్లలో ఆరు మోటార్లు పనిచేయకపోవడమే పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రామా.. ఎన్నాళ్లీ డ్రామా..
● కొండపల్లి శాంతినగర్ సమీపంలో ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌస్ పరిధిలో ఆయకట్టు సాగు భూమి 850ఎకరాలు ఉంది. అయితే మొదటి పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న నాలుగు మోటార్లు ఉండగా, మూడు మోటార్లు పనిచేయకపోవడంతో తొలగించారు. ఒక్కటే మాత్రమే పని చేయడంతో 57.84క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉండగా, కేవలం 14.46క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తోంది.
● కట్టుబడిపాలెం సమీపంలో గల రెండో పంపుహౌస్ పరిధిలో ఆయకట్టు సాగుభూమి 980ఎకరాలుగా ఉంది. ఈ పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న నాలుగు మోటార్లు ఉన్నప్పటికీ ఒక్క మోటారు మాత్రమే పనిచేయడంతో ఇక్కడ కూడా 14.46క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తోంది. ఒకటి, రెండు పంపుహౌస్‌లలో ఒక్కొక్క మోటారు మాత్రమే పనిచేస్తుండటంతో 115.68క్యూసెక్కుల నీటికి గానూ 28.92క్యూసెక్కుల నీటినే ఎత్తిపోయడం వల్ల ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో ఉన్న 1,830ఎకరాలకు అంతంతమాత్రంగానే నీరందుతోంది. అంతే కాకుండా ఈ నీరు ఫోర్స్ లేకపోవడంతో మూడో పంపుహౌస్ వద్దకు కూడా రావడం లేదు.
● ఇక పినపాక గ్రామం సమీపంలో గల మూడో పంపుహౌస్ పరిధిలో ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. ఈ పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న మూడు మోటార్లు ఉండగా ఒక్కటి కూడా పనిచేయక 38.56క్యూసెక్కుల ఎత్తిపోతకు బ్రేక్ పడింది.
● జి.కొండూరు సమీపంలో గల నాల్గో పంప్‌హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. ఈ పంపుహౌస్‌లో 75హెచ్‌పీ కెపాసిటీ మోటార్లు మూడు ఉండగా ఒక్కటి కూడా పనిచేయకపోవడంతో 30.36 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతకు బ్రేక్ పడింది.
ప్రతిపాదనల పేరుతో సాగదీత..
తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు రెండేళ్లుగా గాలికొదిలేశారు. తారకరామ కుడి కాలువపై ఉన్న నాలుగు పంపుహౌస్‌లలో మోటార్లు పని చేయక ఆయకట్టు రైతాంగం నరకయాతన పడుతుంటే పునరుద్ధరణ కోసం రూ.3.56కోట్లతో ప్రతిపాదనలు పంపామంటూ రెండేళ్లుగా అధికారులు ఒకటే పాటపాడటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. 9.25కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాలువలో ఇటీవల రూ.8లక్షల వెచ్చించి పూడిక తీత పనులు పూర్తి చేశారు. అయినప్పటికీ కాలువ పొడవునా ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయి కాలువలో నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్లు సక్రమంగా లేక విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంది.
మూడో పంపుహౌస్ కింద నేను నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకొని మిరప సాగు చేశా. పంపుహౌస్‌కి కరెంటు లేకపోవడం వల్ల మూతబడింది. అధికారులు వెంటనే స్పందించి పంపుహౌస్‌లను బాగు చేయాలి. లేదంటే పైరు పూర్తిగా ఎండిపోయి నష్టపోతాం.
– మండల యాకోబు, రైతు, జి.కొండూరు
తారకరామ ఎత్తిపోతల పథకంలో మోటార్లు, ఇతర పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.3.56కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. మొదటి పంపుహౌస్‌లో రెండో మోటారును సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతానికి పనిచేస్తున్న మోటార్లతో రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నాం.
– జి.వెంకటేశ్, తారకరామ పథకం, ఏఈ
చివరి ఈ రెండు పంపుహౌస్‌లలో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయకపోవడంతో మొత్తానికి మూతబడ్డాయి. ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో ఉన్న 2,990ఎకరాల సాగుభూమి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో పత్తి, మిరప, కూరగాయలు, పండ్లతోటల వంటివి రైతులు సాగు చేశారు. ఇప్పటికే పైర్లు నీటి ఎద్దడికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే అవి పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏడాది పొడవునా నీళ్లు అందుబాటులో ఉండి కూడా ఎత్తిపోయలేకపోవడంతో ఈ నాలుగు పంపుహౌస్‌ల పరిధిలో రబీ సాగును రైతులు పూర్తిగా మరిచిపోయారు.


