విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం మోపెడ్‌ అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి 21న నాగార్జున యూనివర్సిటీలో స్కిల్‌ టెస్ట్‌ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈఏపీ సెట్‌–2026 పరీక్ష రాసి స్పోర్ట్స్‌ కోటా కింద అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే ఈ స్కిల్‌ టెస్ట్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌, కోచ్‌లు హాజరై అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ టెస్ట్‌కు హాజరు కావాలని స్పష్టం చేశారు.

డీజే కి కనెక్షన్‌ ఇస్తుండగా ఘటన

నాగాయలంక: మండలంలోని ఎదురుమొండి శివారు జింకపాలెం గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం కోసం డీజే కి కనెక్షన్‌ ఇస్తూ విద్యుదాఘాతంతో కొప్పనాతి భరత్‌కుమార్‌(19)అనే యువకుడు మృతి చెందినట్లు స్థానిక ఎస్‌ఐ కలిదిండి రాజేష్‌ శుక్రవారం తెలిపారు. మండలంలోని నాలి గ్రామానికి చెందిన భరత్‌ తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూల్‌లో వెల్డింగ్‌ పని చేస్తూ జీవిస్తుంటాడని, 20రోజుల క్రితం ఇంటికి వచ్చాడని చెప్పారు. గ్రామంలో డీజే సిస్టమ్‌ నడిపే నాయుడు హరీష్‌ వద్ద పని చేస్తూ అతనితో కలసి జింకపాలెం వెళ్లాడని తెలిపారు. అక్కడ వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళ్లే ఊరేగింపు కోసం డీజే కి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చే సమయంలో షాక్‌ తగిలి కింద పడిపోవడంతో స్థానికులు 108కి సమాచారం ఇచ్చి అవనిగడ్డలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారని, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. మృతుడి తండ్రి కొప్పనాతి నాగుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాజేష్‌ వివరించారు.

వీటీపీఎస్‌ కాలువలో పడి వృద్ధురాలు మృతి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కాలకృత్యా లు తీర్చుకునేందుకు వెళ్లి ఓ వృద్ధురాలు కాలువలో పడి మృతి చెందిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. గొల్లపూడికి చెందిన బండ్లమూడి పెంటమ్మ(80)కు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లడం అలవాటు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బహిర్భూమికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 12 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వీటీపీఎస్‌ కాలువ ప్రాంతంలో కుటుంబ సభ్యులు వెదికారు. చుట్టు పక్కల అంతా వెదికినా ఫలితం లేకుండా పోయింది. మరుసటి రోజు సాయంత్రం పెంటమ్మ మృతదేహం వీటిపీఎస్‌ గేటు వద్ద లభ్యమైంది. దీనిపై పెంటమ్మ కుమారుడు బండ్లమూడి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని, కాలువ వద్దకు వెళ్లి కాలు జారి కాలువలో పడి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): వెస్ట్‌ బైపాస్‌లోకి వెళ్లే క్రమంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద మోపెడ్‌ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో కార్పెంటర్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రమాదంపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ యనమలకుదురుకు చెందిన సరిహద్దు సుజాత, రాజేష్‌ భార్యభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. రాజేష్‌(47) కార్పెంటర్‌గా పని చేస్తుంటాడు. గురువారం రాత్రి తన మోపెడ్‌పై పనికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో రాజేష్‌ ఫోన్‌ నుంచి ఎవరో ఫోన్‌ చేసి మీ తాలుకా వ్యక్తి వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో పడి ఉన్నాడని చెప్పారు. దీంతో సుజాత తన అన్నయ్య చిట్టిబాబుతో కలిసి ప్రమాదం జరిగిన పాముల కాల్వ సర్వీసు రోడ్డు వద్దకు చేరుకున్నారు. సర్వీసు రోడ్డు నుంచి వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులోకి వెళ్లే క్రమంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద మోపెడ్‌ అదుపు తప్పి కింద పడి గాయపడిన రాజేష్‌ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement