మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వరకూ పలుచోట్ల పగుళ్లిచ్చి, గోతులు పడిన రోడ్డు వంతెనలు కల్వర్టుల వద్ద బయటకొచ్చిన ఇనుప సువ్వలు తరచూ ప్రమాదాలు.. వాహనాలకు పంక్చర్లు పట్టించుకోని అధికారులు
టోల్ వసూలు ఆపేయాలి
అవనిగడ్డ: పేరుకే 216 జాతీయ రహదారి. ఏమరుపాటుగా వాహనం నడిపితే ప్రమాదం బారిన పడటం ఖాయం. కొన్నిచోట్ల కల్వర్టులు, వంతెనల వద్ద ఇనుప చువ్వలు బయట పడటం వల్ల వాహనాలకు తరచూ పంక్చర్లు అవుతున్నాయి. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ ఉన్న 216 నంబరు జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి. మచిలీపట్నం – పులిగడ్డ మధ్య ఈ రహదారిపై పలుచోట్ల గోతులు పడటం, పగుళ్లివ్వడం, గాడులు పడటం వల్ల వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దగ్గరకు వచ్చే వరకూ గొయ్యి, గాడులు కనబడకపోవడంతో షడన్ బ్రేకులు వేయడంతో తరచూ వాహనదారులు పడిపోతున్నారు. మూడు రోజుల క్రితం చల్లపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఓ దంపతులు అవనిగడ్డ వస్తుండగా మోపిదేవి వద్దకు రాగానే గొయ్యి వద్ద అదుపు తప్పి వాహనం పడిపోయింది. వెనుక ఉన్న మహిళకు గాయాలవగా కుట్లు కూడా పడ్డాయి. సోమవారం లక్ష్మీపురం నుంచి ద్విచక్ర వాహనంపై మోపిదేవి వస్తున్న ఓ దంపతులు ఇలాగే గోతిలో వాహనం పడిపోవడంతో అదుపు తప్పి కింద పడ్డారు. నిదానంగా రావడంతో చిన్న చిన్న దెబ్బలతో బయట పడ్డారు.
ప్రమాద ప్రాంతాలివే...
మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వైపు వస్తుంటే కృష్ణారావుపేట, ఆర్.గొల్లపాలెం రోడ్డు, గుండుపాలెం మలుపు, జీలగలగండి, మాజేరు, లక్ష్మీపురం వంతెన ప్రాంతం, మలుపు వద్ద, చల్లపల్లి డీఆర్‌కే ప్రసాద్ రోడ్డు, పెదకళ్లేపల్లి రోడ్డు, పెదప్రోలు, మోపిదేవి ఎంట్రన్స్, వార్ఫు, పులిగడ్డ వారధికి ఇరువైపులా రహదారి దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జీలగలగండి వంతెనపై గతంలో సువ్వలు బయట పడటంతో మరమ్మతులు చేశారు. మళ్లీ ఐదు చోట్ల రోడ్డు దెబ్బతిని సువ్వలు బయట పడ్డాయి. చల్లపల్లి పద్మావతి వైద్యశాల రోడ్డుకు ముందు కల్వర్టుపై ఇనుప సువ్వలు బయటకొచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దెబ్బతిన్న, గోతులు పడిన, ఇనుప సువ్వలు బయటకొచ్చిన ప్రాంతాల్లో మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
మచిలీపట్నం నుంచి పులిగడ్డ వరకూ ఉన్న 216 జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. చాలా చోట్ల గోతులు పడి, గాడులు పడటం వల్ల ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు పడిపోతున్నాం. కల్వర్టులు, వంతెనల వద్ద సువ్వలు పైకి లేచాయి. టోల్ వసూలు చేసేది రోడ్లు బాగు చేయడానికే. రోడ్డుకు మరమ్మతులు చేయనపుడు టోల్ ఆపేయాలి.
– తుర్లపాటి రామ్మోహనరావు, అవనిగడ్డ


