చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్‌

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్‌

కోనేరుసెంటర్‌: మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను చిలకలపూడి, ఇనకుదురుపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి వెండి, బంగారు ఆభరణాలతో పాటు పలు సెల్‌ఫోన్‌లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బందరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు శుక్రవారం చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన గంటా తరుణ్‌కుమార్‌, విన్నకోట దినేష్‌కుమార్‌, సుకర్లాబాదుకు చెందిన గొరిపర్తి సాయికుమార్‌, మరో మైనర్‌ బాలుడు స్నేహితులు. వ్యసనాలకు అలవాటుపడిన వీరంతా గతంలో పెడన నియోజకవర్గంలోని గూడూరు తదితర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీన చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తపేటకు చెందిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 3.77 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు 43.824 గ్రాముల రెండు వెండి ఉంగరాలను అపహరించారు. సెప్టెంబరు ఒకటో తేదీన హౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన మరో ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు 54.176 గ్రాముల విలువ గల రెండు వెండి కుందులు, రెండు వెండి ప్లేట్లు అపహరించుకుపోయారు. ఈ రెండు చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం మాచవరం మెట్టు సమీపంలోని రెడ్‌పిచ్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా పై నేరాలకు పాల్పడింది తామేనని అంగీకరించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రెండు నేరాల్లో చోరీ చేసిన వస్తువులన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నలుగురిలో ఒకరు మైనర్‌ కావటంతో విజయవాడలోని జువైనెల్‌ హోంకు పంపుతున్నట్లు తెలిపారు. మిగిలిన ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చేసిన నేరాలకు సంబంధించి తదుపరి విచారణ నిర్వహిస్తారన్నారు.

పూజల పేరుతో బంగారం టోకరా

మచిలీపట్నం ఇనకుదురుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజుపేట మగ్గాల కాలనీలో ఈ నెల 11వ తేదీన గుర్తు తెలియని కొందరు స్వామీజీ వేషాలు ధరించి ఓ ఇంటికి వెళ్లారు. ఇంటికి కీడు పొంచి ఉందని సదరు యజమానిని నమ్మించారు. ప్రత్యేక పూజలు జరిపి కీడు పోయేలా చేస్తామని చెప్పారు.

పూజను ప్రారంభించి పూజా కార్యక్రమంలో ఏదైనా బంగారు వస్తువును పెడితే కీడు మొత్తం తొలగిపోతుందని నమ్మించారు. దీంతో సదరు మహిళ తన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసును నిందితులకు ఇవ్వగా దాంతో అక్కడి నుంచి ఉడాయించారు. జరిగిన మోసంపై బాధితులు అదే రోజు ఇనకుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన అల్లం నాగరాజు, అల్లం సాయిబాబు, మోతే గంగరాజు, మోతే నాని అనే నలుగురు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. శుక్రవారం పై నలుగురు ఆగిరిపల్లిలో ఉన్నట్లు తెలుసుకున్న సీఐ పరమేశ్వరరావు, బందరు సీఐ కె.ప్రసాద్‌, సీసీఎస్‌ ఎస్‌ఐలు నాగరాజు, జె.శ్రీనివాసు, కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది కలిసి అక్కడికి వెళ్లి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు గొలుసుతో పాటు రూ.6500 నగదు, రెండు మోటార్‌ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో చిలకలపూడి సీఐ ఎస్‌ కే నబీ, ఇనకుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్‌ఐలు నాగరాజు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సీసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement