టెలీ–మానస్‌తో మానసిక ఆరోగ్య సేవలు..
సహాయం కోరడం బలహీనత కాదు..
ప్రతి ఒక్కరి బాధ్యత..
క్షణికావేశం..
ఆత్మహత్యల నివారణకు అవగాహనే మార్గం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్య గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి నిజంగా జీవితాన్ని ముగించాలనుకోడు. చాలాసార్లు వారు తమ బాధను, నిస్సహాయతను, ఒంటరితనాన్ని ముగించాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎదుటి వారు వారికి తీర్పు చెప్పడం కాదు.. అర్థం చేసుకోవడం అవసరం. ఒక మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ‘ఏం జరిగింది?’ కంటే ‘నీకు ఎలా అనిపిస్తోంది?’ అని అడగాలి. ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. అది కుటుంబాన్ని, స్నేహితులను, సమాజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక మానసిక ఆరోగ్య సమస్య. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబరు 10వ తేదీని ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రజల్లో ఆత్మహత్యను ఎదుర్కోవడంపై అన్ని వర్గాల్లో అవగాహన పెంచుతున్నారు.
పెరుగుతున్న ఆత్మహత్యలు..
ఇటీవల కాలంలో విద్యార్థులు, వ్యాపారులు, గృహిణిలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రమైన ఒత్తిడి, నిరాదారణకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాం. ఏటా ఉమ్మడి జిల్లాలో 200మందికి పైగా వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ముందుగా గుర్తించవచ్చు..
ఆత్మహత్య ఆలోచన చేసే వారిని ముందుగా గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు అకస్మాత్తుగా మౌనంగా మారడం, అందరినీ దూరం పెట్టడం.. నాకు ఇక ఏమీ అవసరం లేదు.. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. నేను లేకపోతే అందరికీ మంచిది.. వంటి మాటలు మాట్లాడటం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం వంటి సంకేతాలను చూపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అలా ఆలోచించకు.. నీకు అన్నీ ఉన్నాయి కదా.. ఇది చిన్న సమస్య అని చెప్పడం వారి బాధను కాస్త తగ్గించవచ్చు. ఒక వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నట్లు అనిపిస్తే, వారిని ఒంటరిగా వదిలేయకుండా వెంటనే కుటుంబ సభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు, అత్యవసర సేవలను సంప్రదించాలి.
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని టెలీమానస్ కేంద్రంలో టోల్‌ఫ్రీ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్, సంక్షోభ సమయంలో సహాయం, ప్రమాదాన్ని గుర్తించడం, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలకు రిఫర్ చేయడం వంటి సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో టెలీ–మానస్ సేవలకు స్పందన క్రమంగా పెరుగుతోంది. ఈ కేంద్రం 2022లో ఏర్పాటు కాగా, ఆ ఏడాది 523 కాల్స్ రాగా 2023లో 18వేలు, 2024లో 20వేలు, 2025లో 17వేలు, 2026లో ఇప్పటివరకు 31వేల కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అందిన 86,529 టెలీ–మానస్ కాల్స్‌లో 2.16 శాతం ఆత్మహత్య ఆందోళనలకు సంబంధించినవే ఉన్నాయి.
యువతలో విద్యా ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ సంబంధాల్లో సమస్యలు, కుటుంబ విభేదాలు, సోషల్ మీడియా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వైఫల్య భయం వంటి అంశాలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. పరీక్షలో విఫలం అయితే జీవితం విఫలం కాదని తెలుసుకోవాలి. ఒక ఉద్యోగం రాకపోవడం భవిష్యత్తు ముగిసినట్లు కాదన్నది గ్రహించాలి. ఆయా సమయాల్లో ఇతరులను సహాయం కోరడం బలహీనతగా భావించవద్దు.
– గర్రే శంకరరావు, సైకాలజిస్ట్
శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించినట్లే, మనసులో బాధ, నిరాశ, ఆందోళన ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక వైద్యులను సంప్రదించడం ఆరోగ్యకరమైన నిర్ణయం. సమయానికి ఇచ్చే కౌన్సెలింగ్, మానసిక చికిత్స తీసుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యను సమర్థంగా నిర్వహించవచ్చు. ఆత్మహత్య నివారణ ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ, కార్యాలయం, ప్రతి స్నేహితుడు భాగస్వామి కావాలి.
– డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్,
మానసిక వైద్య నిపుణులు


