● డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
● కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సైబర్ క్రైమ్
కోఆర్డినేషన్ సెంటర్(సీ4) ప్రారంభం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (సీ4)ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ 3వ అంతస్తులో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని బుధవారం ఆయన పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
త్వరలో సైబర్ గార్డ్ పాలసీ..
ఈ సందర్భంగా డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాదిరిగానే సైబర్ కేసులు తీవ్రంగా ఉన్నాయన్నారు. సీఎం చంద్ర బాబు దిశానిర్దేశంతో ఇప్పటికే డ్రగ్స్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా సైబర్ కేసులు నియంత్రించడానికి త్వరలోనే రాష్ట్రంలో సైబర్ గార్డ్ పాలసీని తీసుకురావడంతో పాటు రాష్ట్రస్థాయిలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు 20 మంది సైబర్ కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
వేగంగా న్యాయం..
పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సీ4 ద్వారా ఫిర్యాదు నుంచి నిందితుల ఆనవాళ్ల వరకు ప్రతి సమాచారాన్ని ఆధునిక పరిజ్ఞానంతో విశ్లేషించి బాధితులకు వేగంగా న్యాయం అందిస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక ప్రత్యేక సైబర్ ఎస్‌ఐని నియమించి వారికి ఆధునిక సాంకేతిక దర్యాప్తు పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాష్, సైబర్ క్రైమ్ డీసీపీ కె.కృష్ణ ప్రసన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


