గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామీణ మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తూ, పారిశ్రామిక రంగాల వైపు ప్రోత్సహించేందుకు జిల్లాలో అమలుచేస్తున్న రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(రైజ్) కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగం, స్వయం సహాయక సంఘాల మహిళలు, భాగస్వామ్య సంస్థల సమష్టి కృషికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ నుంచి బుధవారం అధికారులతో కలిసి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ మంథన్ వెబినార్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పాల్గొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాఽధి నిర్మాణం అనే అంశంపై ఈ వెబినార్‌ను నిర్వహించారు. జిల్లాల స్థాయిలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను జాతీయ స్థాయిలో పరస్పరం పంచుకునేందుకు ‘స్కిల్ మంథన్’ను వేదికగా రూపొందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళల జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రదర్శించారు.
మహిళా సాధికారత లక్ష్యంగా..
వెబినార్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం లక్ష్యాలను వివరించారు. నీతి ఆయోగ్, సెర్ప్ తదితర శాఖల సహకారంతో విజయవంతంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషి ఫలితమన్న
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


