లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగోన్నతులు జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయని ఏఎన్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 50 మంది సచివాలయ గ్రేడ్–3లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు అంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత జూలై 11న సర్వీసు రిజిస్టర్లతో పాటు, మచిలీపట్నం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, మరుసటి రోజు ఆదివారం కావడంతో సర్వీస్ రిజిస్టర్‌లు, సంబంధిత ధ్రువ పత్రాలు సేకరించి సమర్పించడానికి సమయం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ సోమవారం జూలై 13న సుమారు 40మంది ఏఎన్‌ఎంలు ఎస్‌ఆర్‌లు సమర్పించినట్లు తెలిపారు. అయితే అప్పటికే ప్రభుత్వం ఉద్యోగోన్నతులపై ఫ్రీజింగ్ వచ్చిందని చెప్పినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి కేడర్‌కు మాత్రమే..
మరలా ప్రభుత్వం తాత్కాలికంగా పోయిననెల ఆగస్టు చివరి తేదీ వరకు ఫ్రీజింగ్ ఎత్తివేయగా, అందులో రాష్ట్ర స్థాయి కేడర్‌లకు మాత్రమే మినహాయింపును ఇవ్వడంతో తమ వంటి చిన్న కేడర్‌లకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. అసోసియేషన్ జిల్లా నాయకుడు కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీడీకే సాగర్, దుర్గాప్రసాద్, వీవీ సత్యనారాయణ బాబు ఉన్నారు.


