11 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే | - | Sakshi
Sakshi News home page

11 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

11 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే స్పోర్ట్స్‌మీట్‌లో పోలీసుల ప్రతిభ అక్షరాస్యత ప్రాధాన్యాన్ని వివరిద్దాం సీడ్‌బాల్స్‌తో పచ్చదనానికి బాట

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి 24వ కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సర్వే పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాం’ అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా రెండు వారాల పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు అంగవైకల్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జేసీ ఎస్‌.ఇలక్కియ,డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ బి.భానునాయక్‌, డీఈఓ ఎల్‌.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

కోనేరుసెంటర్‌: అమరావతిలోని వీఐటీ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ స్టేట్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026లో కృష్ణాజిల్లా పోలీసులు 11 బంగారు, ఏడు వెండి, రెండు కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన సిబ్బంది సోమవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడును మర్యాదపూర్వకంగా కలువగా, ఆయన వారిని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విఽధులతోపాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. ఎస్పీని కలిసిన వారి లో కంకిపాడు సీఐ బీబీ రవికుమార్‌, డీసీఆర్‌బీ సీఐ కె.లక్ష్మణ్‌రెడ్డి, పీసీఆర్‌హెచ్‌సీ సీహెచ్‌ రామ్మో హనరావు, ఇనగుదురుపేట ఉమెన్‌ హెచ్‌సీ ఆర్‌.నాగసరస్వతి, గుడివాడ వన్‌టౌన్‌ పీసీపీ రామచంద్రరావు, తోట్లవల్లూరు పీఎస్‌ పీసీ పి.రామ్‌శివ, ఆత్కూరు పీఎస్‌ పీసీ ఎస్‌.నరేష్‌కుమార్‌, పెనమలూరు సిసిఎస్‌ పీసీ ఎం. సాయికిరణ్‌ ఉన్నారు.

మచిలీపట్నం అర్బన్‌: అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిల్లాలో నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం–2026ను పురస్కరించుకుని సెప్టెంబర్‌ ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అక్షరాస్యత పక్షోత్సవాల్లో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను ఆయన సోమవారం పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు ఎండీ హాజీబేగ్‌ మాట్లాడుతూ ప్రజల కోసం, భూమి కోసం, సమృద్ధి కోసం అక్షరాస్యత అనే ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ థీమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వన్‌ ఎర్త్‌–వన్‌ లైఫ్‌ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం సీడ్‌ బాల్స్‌తో గణేష్‌ ప్రతిమను రూపొందించారు. కలెక్టర్‌ లక్ష్మీశ సీడ్‌ బాల్స్‌తో రూపొందించిన గణేష్‌ ప్రతిమను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో వన్‌ ఎర్త్‌–వన్‌ లైఫ్‌ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యా ర్థులు, సంస్థ వలంటీర్లు తయారు చేసిన 2లక్షల సీడ్‌బాల్స్‌ను అందజేశారు. వన్‌ ఎర్త్‌–వన్‌ లైఫ్‌ ఫౌండర్‌ ఏలూరి లీలా కుమారి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement