రోడ్డెక్కి.. రైతన్న రణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కి.. రైతన్న రణం

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

అక్రమ తూముల నిర్మాణమే ఆందోళనకు కారణం

నాగాయలంక: రైతాంగం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కాలువల ద్వారా అన్ని ప్రాంతాల పొలాలకు సాగునీటిని సక్రమంగా అందించడంలో నీటిపారుదల శాఖ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, స్థానిక నీటి సంఘాల పూర్తిగా వైఫల్యం చెందడంతో రైతన్నల నడుమ తలెత్తుతున్న వివాదాలు, ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని సెంట్రల్‌ చానల్‌ ప్రధాన కాలువ వెంట 2ఏ ఉప కాలువ(బ్రాంచి కెనాల్‌)వద్ద భావదేవరపల్లి, కమ్మనమోలు ఇతర దిగువ ప్రాంత రైతులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఏం జరిగిందంటే..

నాగాయలంక డిస్ట్రిబ్యూటరి కమిటి పరిధిలోని 2ఏ ఉప కాలువ సమీపంలో సెంట్రల్‌ చానల్‌ కాలువ ఉత్తర గట్టుకు 5వ తేదీ అర్ధరాత్రి వేళలో ఈ బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులు గండికొట్టి అక్రమంగా అడుగున్నర వ్యాసార్థం కలిగిన తూములు నిర్మించడంతో సెంట్రల్‌ చానల్‌ దిగువ భావదేవరపల్లి, కమ్మనమోలు నీటి సంఘాల పరిధిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో కాట్రగడ్డ సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ అక్రమ నిర్మాణం చేపట్టారని, పంటకాలువకు గండి కొట్టి, తూములతో అవతలి వైపు మురుగు కాల్వలోకి సాగనీటిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఇరిగేషన్‌ అధికారులతో పాటు నాగాయలంక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిర్మాణానికి వినియోగించిన మిషన్‌, ట్రాక్టర్‌లను స్టేషన్‌లో అప్పగించారు.

అధికారులతో వాగ్వాదం..

రెండు రోజులు గడిచినా అక్రమ తూములు తొలగింపు చర్యలు లేకపోవడంతో ఆగ్రహించిన దిగువ ప్రాంత రైతులు భావదేవరపల్లి మాజీ సర్పంచి మండలి ఉదయభాస్కర్‌ సారథ్యంలో తొలుత మర్రిపాలెంలోని నాగాయలంక ఇరిగేషన్‌–డీసీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయంతో బయలు దేరారు. అయితే రెండో నంబరు కాలువ వద్ద అక్రమ తూములు వేసిన చోట అధిక సంఖ్యలో రైతులు గుమిగూడటంతో ఇరిగేషన్‌ ఏఈ పొన్నూరు రవితేజ, డీసీ చైర్మన్‌ బండ్రెడ్డి చినబాబు, నాగాయలంక ఎస్‌ఐ కె.రాజేష్‌ సిబ్బందితో చేరుకొని మాట్లాడారు.

యంత్రాంగం వైఫల్యం..

మాజీ సర్పంచ్‌ ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ ఇరిగేషన్‌ యంత్రాంగం పూర్తి వైఫల్యం వల్లే రైతులు రోడ్డునపడ్డారని ఆరోపించారు. పంటకాల్వలకు సాగునీటి విడుదల విషయంలో ఆది నుంచి స్పష్టత లేదన్నారు. గండికొట్టిన వ్యక్తులు అధికార పక్షం కావడం వల్లే దిగువ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

తొలగిస్తాం..

అక్రమ తూములు తొలగింపుపై ఏఈ రవితేజను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి తొలగిస్తామన్నారు. గురువారం తూములు తొలగించే చర్యలు చేపడతామని చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగిందని ఎస్‌ఐ రాజేష్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement