గ్రేటర్‌ లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ లేనట్టే!

Sep 5 2026 7:37 AM | Updated on Sep 5 2026 7:37 AM

● ఊరించి.. ఉసూరుమనిపించారు! విజయవాడలో డివిజన్‌లను పెంచుతూ నోటిఫికేషన్‌ ఇదీ పరిస్థితి.. ఇప్పుడు ఇలా..

ఇక పెరిగిన డివిజన్‌లతోనే ఎన్నికలకు.. ఎన్నికలకు ముందు గ్రేటర్‌ అంటూ హడావుడి గతేడాది 75 గ్రామాలను కలుపుతామని ప్రకటనలు ఇప్పుడు 64 నుంచి 86 డివిజన్‌లకు పెంచుతూ నోటిఫికేషన్‌

అభ్యంతరాలకు అవకాశం

జనాభా పెరిగినా..

● ఊరించి.. ఉసూరుమనిపించారు!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడకు గ్రేటర్‌ యోగం ఇప్పట్లో లేనట్టే! మొన్నటివరకూ గ్రేటర్‌ అంటూ ఊరించిన ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన డివిజన్‌లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 64 డివిజన్‌ల స్థానంలో 86 డివిజన్‌లకు పెంచుతూ శుక్రవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థ మూడు సర్కిళ్లు పరిధిలో ప్రస్తుతం 64 డివిజన్లుగా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్‌ విజయవాడగా మార్చేందుకు 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనికిగాను విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలను కలుపుకుని గ్రేటర్‌గా రూపాంతరం చేయటానికి కొంతమేర కసరత్తు కూడా చేసింది. 61.88 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడను పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, విజయవాడ రూరల్‌ మండలాలు, మైలవరం మండలాల్లో ఉన్న 46 గ్రామాలతో తొలుత 330 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అప్పటి మునిసిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌ కూడా గ్రేటర్‌ ప్రతిపాదనపై చురుగ్గా వ్యవహరించి గ్రామాలతో కూడా చర్చలు జరిపారు. అయితే తర్వాత ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. మళ్లీ ఎన్నికల ముందు గ్రేటర్‌ అంటూ హామీలు ఇచ్చారు.

2025లో మళ్లీ గ్రేటర్‌ ప్రతిపాదన రాగా ఆయా మండలాల్లో 75 గ్రామాలను విలీనం చేయాలని, 500 కిలో మీటర్లు విస్తీర్ణంలో గ్రేటర్‌గా మార్చాలని ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిపై గత ఏడాది డిసెంబర్‌లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ప్రతిపాదన చేశారు. ఇక అంతా అయిపోతున్నట్లు ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేవలం విజయవాడకు మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, డివిజన్ల పునర్వవస్థీకరణతో 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డివిజన్‌ సరిహద్దులు కూడా మార్చారు. తాజాగా 86 డివిజన్లకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయవాడ నగర ఏరియల్‌ వ్యూ

నోటిఫికేషన్‌ విడుదల..

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా పెంచుతూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. డివిజన్లు పునర్విభజన శాసీ్త్రయంగా జరగలేదని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర డివిజన్ల పునర్విభజనపై, డివిజన్‌ సరిహద్దులపై నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. విజయవాడ నగరంలో 86 డివిజన్లుగా మారుస్తున్నందున దీనిపై నగరవాసులకు సమాచారం నిమిత్తం ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్‌లోని సర్కిల్‌–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్‌–2 కార్యాలయంలో, పటమటలోని సర్కిల్‌–3 కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలుంటే ప్రజలు రాతపూర్వకంగా అధికారులకు అందించాలని సూచించారు.

2017లో వచ్చిన గ్రేటర్‌ ప్రతిపాదన సమయంలో విజయవాడ నగర జనాభా కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే. విలీన ప్రతిపాదన పంచాయతీల జనాభా నాలుగు లక్షలు. అయితే గ్రేటర్‌ చేయాలంటే ఆ నగర జనాభా 15 లక్షలకు మించి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహకల్ప శాఖ నిబంధన ఉంది. ఈ మేరకు 2026 నాటికి విజయవాడ నగర జనాభా 13లక్షలుగా ఉండగా, పరిసర ప్రాంత గ్రామాల జనాభా మరో నాలుగున్నర లక్షలు ఉంది. ఆయా గ్రామాల విలీనం కలుపుకుని గ్రేటర్‌ విజయవాడ చేస్తే విజయవాడ జనాభా 17.5లక్షలు అవుతుంది. గతంలో విలీనం చేయాలని ప్రతిపాదించిన గ్రామాల్లో ఒకటైన తాడిగడప ఇప్పుడు మునిసిపాలిటీగా మారింది. కొండపల్లి గ్రామం కూడా మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ గ్రేటర్‌ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement