దుర్గమ్మకు స్వర్ణాభరణాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు స్వర్ణాభరణాల సమర్పణ

Sep 5 2026 7:37 AM | Updated on Sep 5 2026 7:37 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం స్వర్ణాభరణాలను సమర్పించారు. విజయవాడ బ్యాంక్‌ కాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీప్రణవి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సుమారు 22.8 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు బొట్టు(నవరత్నాలు, డైమండ్స్‌ పొదిగినది), బంగారు నత్తు(డైమండ్స్‌, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగినవి, బంగారు బులాకీ(డైమండ్స్‌, ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యం పొదిగినది)లను తయారు చేయించి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం బహూకరించారు.

అందరి సహకారంతోనే ప్లాస్లిక్‌ నిర్మూలన సాధ్యం

చల్లపల్లి: ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని డెప్యూటీ ట్రైనీ కలెక్టర్‌ బి.నిఖిల చల్లపల్లి ప్రజలను కోరారు. ఈనెల ఒకటో తేదీ నుంచి చల్లపల్లిలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు, గ్లాసులు, అలాగే పేపర్‌ గ్లాసులు, టీ కప్పులు వంటి వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అదేరోజు అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా ప్లాస్టిక్‌ వస్తువులను స్వాధీనం చేసు కుని మొదటి విడతగా హెచ్చరించి వదిలేశారు. కాగా అవే షాపులకు ట్రైనీ కలెక్టర్‌ నిఖిల అధికారులతో కలిసి శుక్రవారం మరలా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పేపర్‌, ప్లాస్టిక్‌ గ్లాసుల స్థానంలో వ్యాపారులు గాజు గ్లాసులను వినియోగించటం, ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల వాడకం ఆపివేయటంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట డెప్యూటీ ఎంపీడీవో పేర్ని మాధవేంద్రరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సూర్యరావు, కానిస్టేబుల్‌ రవి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్‌ బోలెం నాగమణి ఉన్నారు.

రైస్‌ కౌంటర్లలో తనిఖీలు

మచిలీపట్నంటౌన్‌: వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైస్‌కౌంటర్లను శుక్రవారం కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్‌ తనిఖీ చేశారు. మచిలీపట్నం నగరంలోని రెండు రైతుబజార్లలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతిరోజు జరిగిన విక్రయ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయటంతో పాటు సంబంధిత రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని పౌరసరఫరాలశాఖకు సంబంధించిన డెప్యూటీ తహసీల్దార్లకు సూచించారు. బియ్యం కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కౌంటర్ల వద్ద బియ్యం నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవాలన్నారు.

మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. మచిలీపట్నం–తిరుచానూరు(07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారుజామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement