ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ చెంతన మహిళలు సామూహిక వర లక్ష్మీవ్రతాలను ఆచరించారు. దేవస్థానం మహామండపం ఆరో అంతస్తు సామూహిక వరలక్ష్మీవ్రతాలకు వేదికై ంది. ఆరో అంతస్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతంతో పాటు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో, ప్రధాన ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
వరలక్ష్మిగా దుర్గమ్మ..
మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. రూ. 1500 టికెట్‌పై సుమారు వంద మంది మహిళలు ప్రత్యేక ఆర్జిత సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించగా, 600మందికి పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రి, గాజులు, రవికలతో పాటు అమ్మవారికి నివేదనగా సమర్పించేందుకు పూర్ణాలు, చక్రెర పొంగలి, పులిహోరలను దేవస్థానమే అందజేసింది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ. 100, రూ. 300టికెట్ క్యూలైన్‌లో ఉచితంగా అనుమతించారు.
కృష్ణునికి విశేష అభిషేకాలు, పూజలు..
కృష్ణాష్టమిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తొలుత కృష్ణుని విగ్రహానికి ఆలయ ఈవో శీనా నాయక్ అభిషేకాలు నిర్వహించారు. చైర్మన్ రాధా కృష్ణ పాల్గొన్నారు. సాయంత్రం రాజగోపురం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
బారులు తీరిన భక్తులు..
శ్రావణ మాసం నాల్గో శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఘాట్‌రోడ్డులోని సమాచార కేంద్రం వరకు, ఇటు మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. భక్తులతో పాటు గత రెండు రోజులుగా శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నవ దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.


