వ్యవసాయ ట్రాక్టర్లపై పన్ను వసూలు చేస్తున్న సర్కారు
జగన్ ప్రభుత్వంలో
ట్యాక్సులు
సున్నా..
రాష్ట్ర విభజన తర్వాత లేనేలేదు..
నందిగామరూరల్: ఒకవైపు విత్తనాలు ధర.. మరోవైపు ఎరువుల ఖర్చు.. రోజురోజుకు పెరుగుతున్న కూలీ రేట్లు.. పెట్రోల్, డీజిల్ సంగతి సరేసరి.. పెరిగిన సాగు ఖర్చులకు వెనుకాడకుండా ప్రకృతి విపత్తులను తట్టుకుని.. పంట సాగు చేస్తున్న అన్నదాతలపై కూటమి సర్కారు మోపిన ట్యాక్సుల భారం వారి పాలిట గుదిబండగా మారుతోంది. వ్యవసాయ భూములు దున్ని నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొచ్చే రైతన్న బండి(ట్రాక్టర్)పై కూటమి ప్రభుత్వం ట్యాక్సులు విధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్యాక్సులు లేకుండా దర్జాగా తిరిగిన తమ రథాలు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ట్యాకులు, పెనాల్టీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
ఇదీ సంపద సృష్టేనా..
చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా.. ట్రాక్టర్‌లపై ట్యాక్సులు వసూలు చేసి సంపద సృష్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. ట్రాక్టర్ ప్రభుత్వం దృష్టిలో యంత్రం అయినప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు మాత్రం కుటుంబ జీవనాధారమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్‌లపై పలు రకాల పన్నులు విధించటమేంటని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ భారం.. ట్యాక్సులు అదనం..
నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలోని 69 గ్రామ పంచాయతీలలో సుమారు 750కు పైగా ట్రాక్టర్‌లున్నాయి. పెరిగిన సాగు ఖర్చులకు తోడు రుణాల వాయిదాలు, ఇంధనం, మరమ్మతులు, టైర్లు, డ్రైవర్ ఖర్చులతో ట్రాక్టర్ నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం మూడేళ్ల పన్నులు, జరిమానాలు విధించటం మరింత అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్‌లపై వసూలు చేస్తున్న మూడు రకాల పన్నులను రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా మోటార్ వెహికల్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్‌కు సంబంధించి రవాణా శాఖాధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్‌లపై పన్నులు వసూలు చేయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2023 వరకు ట్రాక్టర్‌లపై ఒక్క రూపాయి కూడా పన్నులు విధించలేదని చెబుతున్నారు. 2023 సెప్టెంబర్‌లో పన్నులు వసూలుకు ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ రైతుల వద్ద నుంచి మాత్రం పన్నులు కూడా వసూలు చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం 2023 సెప్టెంబర్ నుంచి పన్నులను పెనాల్టీలతో పాటు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు ఇలా..
ఏడేళ్ల లోపు ట్రాక్టర్‌కు ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ. 8,970, లేబర్ ట్యాక్స్ రూ.1,480, ఏడేళ్లు దాటిన ట్రాక్టర్‌లకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ రూ.2,960 చొప్పున వసూలు చేస్తుండటంతో అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. లేబర్, గ్రీన్ ట్యాక్స్‌ను ఏడాదికొకసారి రూ. 460కాగా మోటార్ వెహికిల్ ట్యాక్స్ మాత్రం మూడు నెలలకొకసారి రూ.460 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది.
వ్యవసాయ ట్రాక్టర్‌లకు మూడు రకాల ట్యాక్స్‌లు విధించటం సరికాదు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో పాటు ట్రాక్టర్‌ల నిర్వహణ కష్టంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు ట్రాక్టర్‌లకు మోటార్ వెహికిల్, లేబర్, గ్రీన్ ట్యాక్సులను ప్రభుత్వాలు వసూలు చేయలేదు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్‌లకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మూడు రకాల పన్నులు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాక్సుల వసూలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– డి. శేషయ్య, రైతు


