జల్‌ జీవనంపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జల్‌ జీవనంపై నిర్లక్ష్యం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

జల్‌ జీవనంపై నిర్లక్ష్యం

కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు అందని రక్షిత తాగునీరు ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపమే కారణం ఎ.కొండూరు మండలంలో ఆగని గిరిజనుల మృత్యుఘోష

తిరువూరు: ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్న తాగునీటి కారణంగా కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఎ.కొండూరు మండలంలోని గిరిజనులకు రక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఉదాసీనవైఖరి అవలంబిస్తు న్నాయి. ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ మండలంలో జలజీవన్‌మిషన్‌ పథకంలో భాగంగా 854 కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు గోపాలపురం, మాధవరంలో మూడు సంపులు, 21 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. వాటి నుంచి అన్ని పంచాయతీలు, శివారు గ్రామాలు, తండాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేయాలన్నది లక్ష్యం. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాలను ఎ.కొండూరు మండలానికి సరఫరా చేసేందుకు 2023లో రూ.49.44 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పైలెట్‌ ప్రాజెక్టు పనులు గతంలోనే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి అన్ని గ్రామాలకు కృష్ణా నదీ జలాలను అందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌ శాఖల నడుమ సమన్వయం లోపించింది. ఫలితంగా రక్షిత తాగునీరు అందక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. పేదలు రోజుకు రూ.50 ఖర్చు చేసి ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లలో మంచి నీరు కొనుక్కుని తాగాల్సివస్తోంది.

పాత పైపులైన్లతోనే నీటిసరఫరా

ఎ.కొండూరు మండలంలోని గ్రామాల్లో పంచాయతీలు బోరు నీటిని విడుదల చేసే పైపులైన్లలోనే కృష్ణా నదీ జలాలను కూడా సరఫరా చేస్తున్నారు. దీనితో కృష్ణా నదీ జలాలను శుద్ధి చేసినప్పటికీ ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్న సాధారణ నీటితో కలసి ఆశించిన ప్రయోజనం నెరవేరడంలేదు. కృష్ణా నదీ జలాలను సరఫరా చేయడానికి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ఆరు నెలల్లో ఈ మండలంలోని కృష్ణారావుపాలెం, రామచంద్రాపురం, కోడూరు, కంభంపాడు, ఎ.కొండూరు, ఎ.కొండూరు తండా, గోపాలపురం, చీమలపాడు, మాధవరం గ్రామాల్లో 15 మంది కిడ్నీరోగులు మృత్యువాత పడ్డారు. ఇంకా పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి తీవ్రతరం అవడంతో డయాలసిస్‌ చేసినా ఫలితం లేక గిరిజనులు, పేద రోగులు మృత్యు ఒడి చేరుతున్నారు.

ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు

రాష్ట్రంలో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులున్న ఎ.కొండూరు మండలంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తిరువూరు, ఎ.కొండూరులో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మండలంలోని భూగర్భ జలాల్లో కిడ్నీవ్యాధికి కారణమైన అంశాలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత కృష్ణా నదీ జలాల సరఫరాకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాలను త్వరలో సరఫరా చేస్తామంటూ జిల్లా అధికారులు ప్రకటించడం మినహా పూర్తిస్థాయిలో అమలుకు నోచడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement