దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయం ఏర్పాట్లు, అమ్మవారి అలంకారాలపై చర్చ మూడు లడ్డూల బాక్స్ ధర రూ.50
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు రూ.25 కోట్లతో అంచనాలను రూపొందించామని దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ఈఓ, ఏఈఓలు, సూపరిండెంటెంట్లు, ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్‌ను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలు చర్చకు రాగా, 50 అంశాలకు ఆమోదం లభించింది. వీటిలో ఎక్కువ ప్రతిపాదనలు దసరా ఉత్సవాలకు సంబంధించినవే. ఈ సమావేశానికి ముందే సుమారు రూ.25 కోట్ల మేర బిల్లులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పనులకు బోర్డు సభ్యులు ఆమోదం తెలపడం గమనార్హం.
ఆమోదం తెలిపిన కీలక అంశాలివే...
ఆస్ట్రేలియాలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం, కుంకుమార్చన నిర్వహించేందుకు ఆరుగురు వైదిక సిబ్బందిని డెప్యుటేషన్‌పై పంపేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. క్లోక్‌రూమ్, చెప్పులస్టాండ్‌లో పని వారిని నియమించి, వారి ద్వారా ఆయా కౌంటర్లు దేవస్థానం నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కును బహిరంగ వేలంలో సంకాబత్లు నాగవైష్ణవి రూ.1.36 కోట్లకు హెచ్చపాటను పాడింది. ఈ వేలానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఉత్సవాల్లో కాయలు, పండ్లను సరఫరా చేసే టెండర్‌ను సీహెచ్.నాగ విజయ, శ్రీవిజయ ట్రేడింగ్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూల సరఫరా టెండర్‌ను ఎం. గంగాధర్‌రెడ్డికి కేటాయించింది. నూతన లడ్డూ పోటు భవనం పక్కనే వంటశాల కోసం రూ.40 లక్షలతో షెడ్డు నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఉత్సవాల్లో తాత్కలికంగా డ్రైవర్లు, సూపర్‌వైజర్ల నియామకానికి రూ.6.20 లక్షల అంచనాలకు, భక్తులను కొండపైకి, దిగువకు తీసుకెళ్లేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుకు రూ.32 లక్షలతో చేసిన అంచనాలకు, డీఈఈగా ఉద్యోగ విమరణ చేసిన వి.కోటేశ్వరరావును కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం. దసరా ఉత్సవాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదాలను కొరత లేకుండా అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆరు లడ్డూల బాక్స్‌ను రూ.100 చొప్పున విక్రయిస్తుండగా, దసరా నుంచి మూడు లడ్డూలను బాక్స్ రూపంలో రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు.
సాక్షి కథనాలపై చర్చ
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వరసగా చోటు చేసుకుంటున్న వివాదాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ వరస కథనాలుగా ప్రచురిస్తోంది. ఈ కథనాలపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి చేసే విశేష అలంకారాలు, ఇటీవల ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య చోటు చేసుకున్న వివాదం, అన్నదాన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి పార్టీకి చెందిన కొంత మంది సభ్యులు దూరంగా ఉండటంతో పాటు ‘సాక్షి’ గురువారం ప్రచురించిన ‘అమీతుమీ తేలుస్తారా... మౌనం పాటిస్తారా’ కథనంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరో వైపు ఆలయ వ్యవహారాలు ‘సాక్షి’కి చేరడంపైన కొంత మంది సభ్యులు చర్చను లేవనెత్తారు. అయితే అవన్నీ వాస్తవం కావడంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారని తెలిసింది.


