కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో విజయవాడ నగరంలో పలుమార్లు డయేరియా వ్యాధి ప్రబలింది. వందల సంఖ్యలో నగర వాసులు ఆస్పత్రుల పాలయ్యారు. గిరిపురం, ఉడ్‌పేట, భవానీపురం, అజిత్‌సింగ్ నగర్, నందమూరి నగర్, పటమట ప్రాంతాల్లో తరచూ డయేరియా ప్రబలుతోంది. గత ఏడాది అజిత్ సింగ్ నగర్‌లో డయేరియా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధానంగా ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నీరు తాగడమే కారణమని జిల్లా వైద్య విభాగం, నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు వాటర్ బబుళ్లలో తాగునీరు సరఫరా చేశారు. మరో వైపు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతపై తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బందరు రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఎక్కువ రోజులు నిల్వవున్న మాంసాన్ని అధికా రులు గుర్తించారు. పటమటలోని మరో రెస్టారెంట్‌లో కూడా నిల్వ ఉన్న మాంసంతోపాటు ఆహార పదార్థాలు తయారు చేసే వంటగది శుభ్రతపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలు, ఆర్వోప్లాంట్ల పనితీరు, అక్కడ నెలకొన్న శుభ్రతపై నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్వాహకులకు జరిమానా విధించాలని, అప్పటికీ ఫలితం లేకుండా ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీలు చేపట్టి, అంతా బాగుందంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా నివేదకలు ఇవ్వడంపై ఆరోపణలు వస్తున్నాయి.


