వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటిన కృష్ణా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటిన కృష్ణా క్రీడాకారులు

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటిన కృష్ణా క్రీడాకారులు రక్తం అందుబాటులో ఉండాలి దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు పది విశేష అలంకారాలు కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో ప్రారంభం

మచిలీపట్నంఅర్బన్‌: తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ, మూడు రజత పతకాలు సాధించారు. జి.లెనిన్‌ ప్రియ, బి.ఝాన్సీ స్వర్ణం, ఓ.గాయత్రి, యశోధర్‌, ఎన్‌.వి.అనూ రజత పతకాలు సాధించారు. గురువారం కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్‌, డీఎస్‌ఏ చైర్మన్‌ డి.కె.బాలాజీ అభినందించారు. కోచ్‌ల కృషి, క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, సాధనతోనే రాష్ట్రస్థాయి విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. డీఎస్‌ఏ కోచ్‌ వి.అయ్యప్ప, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.రవి పతక విజేతలను అభినందించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రక్తం నిల్వలు, రక్తదాన శిబిరాల నిర్వహణను మరింత బలోపేతం చేసి అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం సాయంత్రం డిస్ట్రిక్‌ ఇంటిగ్రేటెడ్‌ స్ట్రాటజీ ఫర్‌ హెచ్‌ఐవీ – ఎయిడ్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లడ్‌ బ్యాంకుల పనితీరు, రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్త నిల్వలు, హెచ్‌ఐవీ నివారణకు చేపడుతున్న చర్యలను కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం, రెడ్‌క్రాస్‌ సంస్థల సమన్వయంతో మరిన్ని శిబిరాలు నిర్వహించాలన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలన్నారు. హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స, సేవలు, నిరంతరం అందేలా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిస్ట్రిక్‌ టీబీ అధికారి డాక్టర్‌ ఎ వెంకట్రావు, డిస్ట్రిక్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ పది విశేష అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. గురువారం జరిగిన ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో దసరా విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్‌ను దుర్గగుడి ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఈ మేరకు 11వ తేదీ నుంచి అమ్మవారు పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల తొలి రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇక విజయ దశమి మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంసవాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసి ఉపాధి, స్వయం ఉపాఽధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్‌ సూచించారు. ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లో కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో, అకాడమీ, ల్యాబ్‌లను ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశతో కలిసి మంత్రి కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో, అకాడమీ యువతకు ఉపాధి కల్పించే వేదికగా నిలుస్తాయన్నారు. జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్‌ రూపంలో డాక్యుమెంట్‌ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీపీఆర్‌ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement