హోటళ్లు, రెస్టారెంట్లలో వీఎంసీ తనిఖీలు డయేరియా ప్రబలిన నేపథ్యంలో చర్యలు మాంసం దుకాణాలు, ఆర్వో ప్లాంట్లు, హోటళ్లు శుభ్రంగా ఉన్నాయని నివేదిక
పటమట(విజయవాడతూర్పు): ఇటీవల విజయవాడలోని పలు హోటల్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల్లో నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంతా బాగుందంటూ నివేదిక ఇచ్చారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల నిర్వా హకుల నుంచి కాసులు దండుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మునిసిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మూడు బృందా లుగా ఏర్పడి, నగరంలోని 64 డివిజన్లలో 286 సచివాలయ పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 624 హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా అవన్నీ శుభ్రంగా ఉన్నా యని, ఎక్కడా సమస్య లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో చికెన్, మటన్, బీఫ్, చేపల దుకాణాలు 353, ఆర్వోప్లాంట్‌లు 241 ఉండగా, అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నివేదించారు. అధికారుల నివేదికలపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి పలువురు అధికారులు డబ్బులు తీసుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఇలా..
హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లలో వంట గదులు శుభ్రంగా ఉండేందుకు ప్రజారోగ్య విభాగం పలు నిబంధనలను సూచిస్తోంది. ఆయా వ్యాపార సంస్థలు సొంతగా ఆరో ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలి. భోజన టేబుల్‌పై మూత ఉన్న తాగునీటి జగ్‌లు ఉంచాలి. కిచెన్ నిత్యం శుభ్రంగా ఉండాలి. మాంసం ఒక్క రోజుకంటే కూడా ఎక్కువ నిల్వ వుండకూడదు. అక్కడ పనిచేసే వర్కర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు హెయిర్ క్యాప్స్ ధరించాలి. అయితే నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇవేమీ కన్పించవు. మాంసం దుకాణాల గోడలకు ఐదు అడుగుల వరకు టైల్స్ వేయాలి. ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నగరంలోని చాలా దుకాణాల్లో ఇలాంటి వాతావరణం కన్పించదు. ఆర్వోప్లాంట్ల వ్యవహారంలో కూడా నిబంధనలు కఠి నంగా ఉన్నాయి. ఫిల్టర్లను ప్రతినెలా శుభ్రం చేయాలి, నీటి శాంపిల్‌ను ప్రతివారం ప్రజారోగ్య అధికారులు పరిశీలించాలి. నీరుపట్టే ప్రాంతంలో నీటి పారుదల సక్రమంగా ఉండాలి. అక్కడ టైల్స్ ఉండాలి. కానీ చాలా ప్లాంట్ల వద్ద ఇవేవీ కన్పించటంలేదు.
పేరుకే నోటీసులు
తనిఖీల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు డొల్లతనం ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 42 రెస్టారెంట్లకు, 11 ఆర్వోప్లాంట్‌లకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. తమ తనిఖీల్లో కేవలం రూ.55 వేల జరిమానా విధించారు. హోటళ్లకు నోటీసులు జారీచేసిన తరువాత తాము సూచించిన అంశాలను సరిచేసుకున్నదీ లేనిదీ తిరిగి పరిశీలించడం లేదు. ఆయా సంస్థల నిర్వాహకులతో హెల్త్ అసిస్టెంట్‌లు, సూపర్‌వైజర్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా బేరాలాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఒక్కో రెస్టారెంట్, హోటల్ రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం.


