విజన్‌కు సిబ్బంది కరువు! | - | Sakshi
Sakshi News home page

విజన్‌కు సిబ్బంది కరువు!

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

పెడన నియోజకవర్గ కార్యాలయంలో ఆరుగురికి ఒక్కరే విధులు మూడు నెలలుగా ఇదే పరిస్థితి.. ముగ్గురు సర్వే శాఖకు.. మహిళా పోలీసు ఏఎస్‌వోగా ఎంపిక మరో పోస్టులో చేరని సిబ్బంది.. ఒక్కరితోనే కార్యాలయం నిర్వహణ

త్వరలోనే సిబ్బందిని ఇస్తామన్నారు

పెడన: నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజన్‌–2048 కార్యాలయం సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. పెడన నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీసులో ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సిబ్బందిని భర్తీ చేయడంలో ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆరుగురితో ప్రారంభం..

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2025 జూలైలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజన్‌–2048 కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెడన ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆరుగురు సిబ్బందిని నియమించారు. యంగ్‌ ప్రొఫిషనల్‌ను నేరుగా ఎంపిక చేయగా.. మిగిలిన ఐదు పోస్టులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఆసక్తిగల సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత, నైపుణ్యం ఆధారంగా ముగ్గురిని సర్వే శాఖ నుంచి, ఒకరిని మహిళా పోలీస్‌ విభాగం నుంచి, మరొకరిని పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎంపిక చేశారు.

మూడు నెలలుగా ఖాళీలు

ప్రారంభంలో యంగ్‌ ప్రొఫిషనల్‌తో పాటు నలుగురు విజన్‌ సిబ్బంది విధులు నిర్వహించారు. సర్వే శాఖకు చెందిన ముగ్గురిని రీసర్వే పనుల కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరిగి వారి మాతృశాఖకు పంపించారు. మహిళా పోలీసు విభాగానికి చెందిన సిబ్బంది ఏఎస్‌వో పోస్టుకు ఎంపిక కావడంతో ఆమె కూడా విధుల నుంచి తప్పుకున్నారు. అయితే ఆమె అప్పటికే ప్రసూతి సెలవులో ఉన్నట్లు సమాచారం. మరో పోస్టుకు ఎంపికైన సిబ్బంది అసలు విధుల్లో చేరకపోవడంతో కార్యాలయం సిబ్బంది కొరతలో చిక్కుకుంది.

అమలు అంతంతే!

నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ఆదాయ వనరులను గుర్తించడం, వాటి ద్వారా అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించడం, దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పీ4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడటం వంటి అంశాలపై విజన్‌–2048 కార్యాలయం పనిచేయాల్సి ఉంది. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించాల్సి ఉంటుంది. అయితే అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెడన నియోజకవర్గానికి విజన్‌–2048 ప్రత్యేక అధికారిగా జడ్పీ సీఈవోను నియమించినప్పటికీ.. కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే సిబ్బందిని కేటాయిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం ఒక్కడినే విధులు నిర్వహిస్తూ.. అడిగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తున్నాను. పెడన నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే విజన్‌–2048 కార్యాలయం ప్రధాన ఉద్దేశం.

–ఎస్‌.హరినాథ్‌బాబు,

యంగ్‌ ప్రొఫిషనల్‌, విజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement