ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు సమర్పించారు. విజయవాడ కృష్ణలంక మెట్ల బజార్‌కు చెందిన పి. రామయ్య, లావణ్య కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన డీవీఎస్ సాయిరాం కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
అప్పన్న అన్నప్రసాదానికి..
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి పామర్రుకు చెందిన యడ్ల మహేష్‌కుమార్ రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. చెక్కును దేవస్థానం ఈవో వెంకటరావుకు అందించారు.
తిరుపతమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ ఆలయ కమిటీ నూతన చైర్మన్‌గా చుంచు రమేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ మండపంలో ఆదివారం ఆలయ ఈఓ జీవీడీఎన్ లీలాకుమార్ ఆధ్వర్యాన చైర్మన్‌తో పాటు సభ్యులుగా కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూయ, పోలుపొంగు జ్యోత్స్న ప్రియాంక, గుగులోతు రమేష్, ఓర్సు సూరమ్మ, కర్నాటి కవిత, తన్నీరు గోపీనాథ్, సూరపనేని అప్పారావు, కాకులపాటి విజయలక్ష్మి, శనగవరపు వెంకటేశ్వరరావు(శాస్త్రి), కొలిపాక హైమావతి, మర్రెబోయిన తిరుపతిరావు(ఆలయ అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యుడు)తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అధికారులతో పాటు పలువురు నూతన పాలకవర్గానికి శాలువాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ప్రధానార్చకుడు మర్రెబోయిన గోపిబాబు, మాజీ చైర్మన్లు వాసిరెడ్డి బెనర్జి, కర్ల వెంకటనారాయణ, అత్తలూరి అచ్యుతరావు, లగడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళ బలవన్మరణం
బంటుమిల్లి: మండలంలోని మల్లేశ్వరం గ్రామానికి చెందిన శొంఠి నాగమణి (24) ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దించగా అప్పటికే మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామం నుంచి నాగమణి తల్లిదండ్రులు కోసం ఎదురుచూస్తున్నారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


