9న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటిస్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

9న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటిస్‌ మేళా

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

9న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటిస్‌ మేళా మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ కళాశాల ఆవరణలో ఈ నెల 9వ తేదీ సోమవారం అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. కనకారావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని వారి కంపెనీల్లో అప్రెంటీస్‌ పూర్తి చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారని తెలియజేశారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్‌ల వారు ఈ అప్రెంటిస్‌ మేళాకు హాజరు కావచ్చన్నారు. 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటోలు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌, కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్‌తో పాటుగా మూడు సెట్ల జిరాక్స్‌లతో అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. విజయవాడ రమేష్‌ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మేళా జరుగుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు ముగ్గురు ప్రొహిబిషనరీ డీటీల కేటాయింపు చిలకలపూడి(మచిలీపట్నం):ఇటీవల గ్రూప్‌–2 లో ఎంపికై న ముగ్గురు ప్రొహిబిషనరీ డెప్యూటీ తహసీల్దార్లను కృష్ణా జిల్లాకు కేటాయించారు. దీంతో వారు శుక్రవారం మచిలీపట్నంలోని కలెక్టర్‌ డీకే బాలాజీని ఆయన చాంబర్‌లో కలిసి జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. పి పద్మావతి, ఎం.ఉమాదేవి, కె.తన్మయిలకు ఒక ఏడాది జిల్లాలో శిక్షణ పూర్తయిన అనంతరం పోస్టింగ్‌ ఇస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, సూపరింటెండెంట్‌ నెల్సన్‌పాల్‌బాబు, గౌతమ్‌ ఉన్నారు. అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం పాము కాటుకు రెండేళ్ళ చిన్నారి మృతి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలోని ఎనిమిది ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టు రోస్టర్‌ ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ ఎంఎన్‌ రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో అర్హత కలిగిన అభ్యర్థులు సీడీపీవో ఆఫీసులో సంప్రదించి ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి వివాహిత అయ్యి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఐసీడీఎస్‌ కార్యాలయ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.

నాగాయలంక: ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల బాలిక పాము కాటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మండలంలోని పెదపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌.ఐ రాజేష్‌ తెలిపిన వివరాల మేరకు.. లోయ శివరామకృష్ణ, ఝాన్సీ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఝాన్సీ ఇంటి ముందు పని చేసుకుంటోంది. ఆ సమయంలో రెండేళ్ల కుమార్తె పల్లవి పక్కనే బూత్‌రూమ్‌ దగ్గర ఆడుకుంటూ అకస్మాత్తుగా ఏడుస్తూ కేకలు వేసింది. అది విని తల్లి కుమార్తె దగ్గరకు వెళ్ళి పరిశీలించగా బాలిక కుడిచేతి మణికట్టు కింద పాము కాటు వంటి రెండు గాట్ల గుర్తులతో రక్తస్రావం కావడాన్ని గమనించింది. తక్షణం చికిత్స కోసం బాలికను అవనిగడ్డ సిహెచ్‌సికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యండకుదురు(ఘంటసాల): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి విద్యుత్తు స్థంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు పడిపోవడంతో పాటు కారు ద్వంసంమైన ఘటన శుక్రవారం ఘంటసాల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. చల్లపల్లి మండల మాజేరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం వాటపల్లిలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మచిలీపట్నం నుంచి మాజేరు కారులో వస్తున్నారు. ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి – పచ్చవారిలంక గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు 11 కేవీ విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు ముందుబాగం దెబ్బ తినడంతో పాటు ట్రాన్స్‌ ఫార్మర్‌ సపోర్టుగా ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్తు వైర్లు కారు మీద పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పడమే కాక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement