దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్‌లో బోధనేతర సిబ్బందిపై దాడికి పాల్పడిన టెన్త్‌ విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లితే.. గత నెల 26వ తేదీన వీరవల్లి జెడ్పీ హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థులు మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతుండగా ల్యాబ్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ రవీంద్రరావు మందలించడంతో టెన్త్‌ విద్యార్థి పునీత్‌, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయనపై దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటం, మీడియాలో వార్తలు వెలువడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుడివాడ డీవైఈవో రవికుమార్‌, బాపులపాడు ఎంఈవో–2 కొమ్మా విజయ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల సమక్షంలో వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌ ముగ్గురు టెన్త్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ ముగ్గురు విద్యార్థులకు క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పట్ల గౌరవం, విద్యా సంస్థలో సత్ప్రవర్తన కలిగి ఉండటం గురించి ఎస్‌ఐ సత్యం సురేష్‌ వివరించారు. తల్లిదండ్రుల గైడెన్స్‌ లోపించడం వల్లే విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణ పాటించడం లేదన్నారు. దీనికిగానూ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల ప్రవర్తన, భవిష్యత్‌కు పూర్తి బాధ్యత వహిస్తామని పేర్కొంటూ తల్లిదండ్రుల నుంచి పోలీసులు హామీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement