కోడూరు: మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ చాణిక్య మంగళవారం తెలిపిన కథనం మేరకు.. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ జాతరలో పోలీసు కానిస్టేబుల్ పి.వేణుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా సోమవారం రాత్రి పిట్టల్లంక గ్రామానికి యువత డీజే ఏర్పాటు చేశారు. అయితే విశ్వనాథపల్లి గ్రామంలోకి వచ్చిన తరువాత డీజేకు సంబంధించిన సౌండ్‌ను తగ్గించాలని కానిస్టేబుల్ వేణుస్వామి నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న పిట్టల్లంక గ్రామానికి చెందిన యువకులు కోట మహేష్, కోట నరేష్ ‘మా డీజే సౌండ్ తగ్గించమంటావా’ అంటూ కానిస్టేబుల్ మెడ పట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ వేణుస్వామిని తోటి పోలీసులు హుటాహుటినా అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.
గుడివాడరూరల్: ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని మోటూరు గ్రామంలో మంగళవారం జరిగింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి మోటూరు గ్రామంలోని పంచా యతీ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ తాలూకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు తాలూకా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెనమలూరు: మండలంలోని పోరంకిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పోరంకికి చెందిన జాస్తి శ్రీదేవి (48), దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ నాలుగేళ్ల క్రితం మృతి చెందటంతో శ్రీదేవి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లిన శ్రీదేవి ఈ నెల ఒకటో తేదీన బయలుదేరి పోరంకికి వచ్చింది. సోమవారం ఇంట్లో బెడ్‌రూమ్‌లో శ్రీదేవి సీలింగ్ ప్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న అత్త జాస్తి ఝాన్సీ ఉరికి వేలాడుతున్న శ్రీదేవిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుమార్తె మేఘనసాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో ఇంటి, నీటి పన్నుల వసూలు ఆయన మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులు, పెండింగ్‌లో ఉన్న పన్నులు, మొత్తం లక్ష్యంపై ఆరాతీశారు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైతం తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా చూసుకోవాలని స్థానికులకు సూచించారు. మీరు చెల్లించే పన్నలుతోనే గ్రామాభివృద్ధి సాథ్యమవుతుందన్నారు. అధికారులు పాల్గొన్నారు.


