విశ్వనాథపల్లి నాంచారమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం మొక్కులు తీర్చుకొనేందుకు బారులు తీరిన భక్తులు వాహనాల రద్దీతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు
కోడూరు: కృష్ణాతీరంలోని విశ్వనాథపల్లి గ్రామం జనజాతరతో పోటెత్తింది. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ప్రధాన జాతరను పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మ వారి పుట్టింటివారైన గుంటూరు, ప్రకాశం జిల్లాల భక్తులు నాంచారమ్మ తల్లి దర్శనానికి బారులు తీరారు. హైదరాబాద్, ఉభయగోదావరి, నల్లగొండ, బెంగళూరు, విజయవాడకు చెందిన భక్తులు కూడా ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వృత్తిరీత్యి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు కూడా విశ్వనాథపల్లికి చేరడంతో ప్రతి ఇంటా పండుగ శోభతో ఉట్టిపడింది. కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన రెండ్లు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
నాంచారమ్మ తల్లికి ఒడుగంటి బియ్యం సమర్పించి ఆలయం వెనుక భాగంలో కదలకుండా అమ్మ నామస్మరణతో ప్రాణాచారం చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. దీంతో మహిళలు ఈ ప్రాణాచారం చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ప్రాణాచారం చేస్తున్న మహిళలపై భక్తులు పసుపు, కుంకుమ చల్లుతూ దీవెనలు అందించారు. కొంతమంది భక్తులు తమ పిల్లలను ఆలయం ఎదుట ధ్వజ స్తంభానికి కట్టిగా, మేనమామ వరుసవారు వేలం ద్వారా విడిపించుకున్నారు. పాలపొంగళ్లు, పట్టువస్త్రాలు, చీరలు, నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. యువకులు డప్పువాయిద్యాల నడుమ కోళ్లు, మేకపోతలను ఊరేగించి సమీప పోలాల్లో కుటుంబసమేతంగా సహపంక్తీ భోజనాలు చేశారు.
చంద్రగ్రహణం నేపథ్యంలో నాంచారమ్మ అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. గ్రామోత్సవంలో ఉన్న చిన్న అమ్మవారిని కూడా ఆలయ ప్రవేశం చేయించారు. పండితులు శాస్త్రోక్తంగా పూజలు గర్భాలయానికి తాళాలు వేశారు. రాత్రి ఎనిమిది గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయ తలుపులు తెరిచి భక్తులకు యథావిధిగా దర్శనం కల్పించారు. ఆలయ ఈఓ తిక్కిశెట్టి వీరవెంకటమోహనరావు, ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్య నరసింహారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సంతానం కోసం ప్రాణాచారం
ఆలయం మూసివేత
జాతర నేపథ్యంలో నాంచారమ్మ మూలమూర్తిని త్రిశూలధారిగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, భక్తుల సమర్పించిన చీరాలు, గాజులు, పూలదండలతో ముస్తాబు చేశారు. తల్లి దివ్యస్వరూపాన్ని తిలకించి భక్తులు పరవశించారు. క్యూలైన్లు మొత్తం భక్తజనంతో కిటకిటలాడాయి. మూలమూర్తిని భక్తులు స్వయంగా తాకే అవకాశభాగ్యం ఉండడంతో పలువురు భక్తులు బంగారు మంగళసూత్రాలు, అభరణాలను సమర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.


