గంపలగూడెం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రాజగోపాలాచార్యులు, పరాశరం విఖనసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 250 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. కల్యాణ వేడుకలు తిలకించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువూరు, మధిర ఆర్టీసీ డిపోలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపాయి. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య, దేవాలయ పాలకమండలి చైర్మన్ కావూరి శశిరేఖ, కమిటీ సభ్యులు కొండపల్లి కొండలరావు, గరిడేపల్లి వెంకటరమణ, మోదుగు సుహాసిని పర్యవేక్షించారు. ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ అధికారులు పదివేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మధురానగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో రాజకీయాలు తగవని, సనాతన ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం మంటకలు పుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సోమవారం జరిగిన వివాదం హిందు వుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న రాజకీయ గొడవలకు నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం వేదికవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో రాజకీయపరమైన ఘర్షణలు తలెత్తడం సర్వసాధార ణంగా మారిందని విమర్శించారు. భగవంతునికి భక్తితో సమర్పించే పట్టువస్త్రాల విషయంలో పదివేల మంది భక్తులు, అర్చక స్వాముల మధ్య ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఘర్షణ జరగటం దారుణమన్నారు. భక్తి భావంతో ఉండాల్సిన వేడుకలో తోపులాటలు, ఘర్షణలకు దేవస్థానం వేదికగా మారటం ఏమిటని ప్రశ్నించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం తెలిపారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జరిపిన దాడుల్లో 15 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణకు చెందిన గోదాంలో సుమారు 15 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని తదుపరి చర్యలు నిమిత్తం కంచికచర్ల ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎనిమిది వాహనాలను వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని వివరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, నివేదికల ప్రకారం సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వలపై జరిపిన దాడిలో డీఎస్వో పి.వాణి, ఏఎస్‌ఓ వి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్లు బి.రామకృష్ణ, సీహెచ్. సుమతి, ఆర్‌ఐ కె.కిషోర్, స్థానిక వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు నమోదైంది. ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్‌పై సిట్ నమోదు చేసిన కేసు నుంచి తమను తప్పించాలని సిట్ విచారణాధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.


