పొంచి ఉన్న ఏఎంఆర్ ముప్పు
విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగం ఇప్పటికే పలు కేసులు వెలుగు చూస్తున్న వైనం వైద్య రంగానికి సవాలుగా మారిందంటున్న వైద్యులు
ఇలా నివారించవచ్చు
యాంటీమైక్రోబియల్స్ రెసిస్టెన్స్ సమంజసమైన వినియోగం
అవసరమైతేనే యాంటీబయాటిక్స్ వినియోగం
ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను అనుసరించడం
కల్చర్, సెన్సిటివిటీ ఆధారిత చికిత్సకు ప్రాధాన్యం
సంక్రమణ నివారణ, నియంత్రణ
చేతుల శుభ్రత పాటించడం
స్టెరిలైజేషన్, డిస్‌ఇన్‌ఫెక్షన్ చేయడం
వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్).. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. మానవ తప్పిదాల కారణంగానే శరీరంలో ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చాలా కొద్దిమందిలో మాత్రమే జీన్స్ కారణంగా ఉంటుంది. ఇది వృద్ధి చెందితే యాంటీబయోటిక్స్ వాడినా పనిచేయని పరిస్థితి నెలకొంటోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలనే చూస్తే, ఇప్పుడు ఏఎంఆర్ వృద్ధి చెందిన రోగులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ప్రసవం కోసం వచ్చిన మహిళలతో పాటు, పలువురు రోగుల్లో ఏఎంఆర్ ఉన్నట్లు గుర్తించారు.
యాంటీ మైక్రోబియల్ అంటే...
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, పరాన్నజీవులు వంటి సూక్ష్మజీవులు కాలక్రమేణా మార్పులు చెంది, వాటిని నాశనం చేయడానికి ఉపయోగించే ఔషధాలకు స్పందించకపోవడాన్ని సూచిస్తుంది. దీంతో సంక్రమణ వ్యాధుల చికిత్స కష్టంగా మారి, అనారోగ్య కాలం పెరగడం, వైద్య ఖర్చు అధికమవడం, మరణాల సంఖ్య పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సమస్య గుర్తించారు. శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ), అవయవ మార్పిడి వంటి సాధారణ వైద్య ప్రక్రియలు అధిక ప్రమాదకరంగా మారవచ్చు.
ఎలా వృద్ధి చెందుతుందంటే..
దాని పరిణామాలు ఇలా
● చికిత్స విఫలమవడం
● అనారోగ్యం, మరణాల రేటు పెరగడం
● ప్రతిఘటక సంక్రమణలు వేగంగా వ్యాపించడం
● ఆరోగ్య వ్యవస్థలపై ఆర్థిక భారం పెరగడం
● స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ముప్పు కలుగుతుంది
ఆరోగ్య సంరక్షణలో నిపుణుల పాత్ర
● బాధ్యతాయుతంగా యాంటీబయోటిక్స్ సూచించడం
● రోగులకు సరైన అవగాహన కల్పించడం
● సంక్రమణ నియంత్రణ పద్ధతులను కచ్చితంగా పాటించడం
● ప్రతిఘటక కేసులను నివేదించడం
ఇవే నిదర్శనం
● జీజీహెచ్‌కు ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు రెండురోజులు ఓరల్ యాంటీబయోటిక్స్ ఇచ్చినా జ్వరం తగ్గలేదు. దీంతో ఆమెకు కల్చర్ పరీక్ష చేసి ఐవీ ఇవ్వడంతో చాలా రోజులకు కోలుకున్నారు.
● నగరానికి చెందిన ఓ 10 ఏళ్ల బాలుడికి అరుదైన ఇన్‌ఫెక్షన్ సోకింది.
అతనికి యాంటీబయోటిక్స్ ఇస్తున్నా ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కాలేదు. డ్రగ్ కల్చర్ టెస్ట్ చేయగా ఏఎంఆర్ ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెనుముప్పుగా మారే ప్రమాదం పొంచిఉంది. యాంటీబయోటిక్స్‌ను సొంతంగా వాడటం, మందుల షాపుల్లో ఇచ్చినవి తీసుకోవడం, పూర్తిస్థాయిలో కోర్సు వాడకపోవడం వంటి కారణాలతో రెసిస్టెన్స్ పెరుగుతుంది. మందులకు లొంగని బ్యాక్టీరియా వైరస్, ఫంగస్‌లు వృద్ధి చెంది రోగికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడొద్దు.
–ఆలపాటి ఏడుకొండలరావు,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల
పొంచి ఉన్న ఏఎంఆర్ ముప్పు


