పుస్తకాలపై యువత దృష్టి
కొలువుదీరిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రధాన వేదికకు బీవీ పట్టాభిరామ్ పేరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యువత దృష్టి పుస్తకాలపై మరలుతోందని సీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన రామచంద్రమూర్తి ఇతర అతిథులతో కలిసి రచయిత బీవీ పట్టాభిరామ్‌కు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా తాను ప్రోత్సహించానన్నారు. ఆ తర్వాత ఆయన అనేక అద్భుత పుస్తకాలను తీసుకొచ్చారని వివరించారు. సాహితీవేత్త సాహిత్య అకాడమీ పురస్కార విజేత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. ఆత్మీయ అతిథి సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పుస్తక మహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో రెండు సార్లు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు అప్పరసు కృష్ణారావు మాట్లాడుతూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత పుస్తకాలదేనన్నారు. పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి కె.లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేయగా, ఎమెస్కో అధినేత డి.విజయకుమార్ సభను నిర్వహించారు. అధ్యక్షుడు టి. మనోహర్‌నాయుడు వందన సమర్పణ చేశారు.
‘నా నోరు కట్టేశారు’
సభకు అధ్యక్షత వహించిన ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తన నోరు కట్టేశారన్నారు. దానికి ముందు సీపీఐ నేత నారాయణ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. నారాయణ చెప్పినట్లు ఆయనకు తనకు నోరు కొంచెం జాస్తి అని కానీ తన నోరును కట్టేశారనడం నిజమేనన్నారు. బుక్ ఫెస్టివల్ సొసైటీకి అమరావతిలో స్థలాన్ని కేటాయించడానికి సహకారం అందిస్తానన్నారు. ఇక్కడ బుక్ ఫెస్టివల్ బాగుందన్నారు.
పుస్తకాలపై యువత దృష్టి


