రంగుల మహోత్సవంపై సమీక్ష
పెనుగంచిప్రోలు: భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే అమ్మవారి రంగుల మహోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ సత్రంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పని చేసి తిరుపతమ్మ రంగుల మహోత్సవం, ఫిబ్రవరిలో కల్యాణ మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఆలయంలో పారిశుద్ధ్యం, ప్రసాదాలపై భక్తుల నుంచి అసంతృప్తులు వచ్చాయని, ఆలయ అధికారులు వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారులు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధింత ఏడీఈ రామకృష్ణను బాధ్యుడిని చేస్తూ ఏపీసీపీడీసీఎల్ యాజమాన్యం కార్పొరేట్ ఆఫీసుకు సరెండర్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. గవర్నర్‌పేట ఏడీఈ బసవరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారిని, ఉన్నతాధికారులు బలిపశువును చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఏడీఈ స్థాయి అధికారే నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నా, వారిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో, ఏడీఈ స్థాయి అధికారిపై చర్యలతో సరిపెట్టినట్లు ఆ శాఖ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. దీనిపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయసంస్థతో విచారణ చేస్తే నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
మచిలీపట్నంఅర్బన్: తగ్గించిన వేతనాలను 104 ఉద్యోగులకు వెంటనే పూర్తిగా చెల్లించాలని ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జా మురళీకృష్ణ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బూర సుబ్రహ్మణ్యం, ఇతర నేతలు మాట్లాడుతూ తొలగించిన క్యాజువల్ లీవ్‌లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులను 104 ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలన్నారు. తొలగించిన బఫర్ సిబ్బందిని నియమించి పని ఒత్తిడిని తగ్గించాలన్నారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 108 కృష్ణా జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్ల వినయ్, ఎం.పోలినాయుడు, సీఐటీయూ నగర కార్యదర్శి జై రావు, ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కార్యదర్శి ఎం. పోలినాయుడు, 102 అధ్యక్షులు అయ్యప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు.


