జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ రహదారులు, మోర్త్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవే) అధికారులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్ (చిన్ని), శాసనసభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం వీరిద్దరూ విలేకర్లతో మాట్లాడారు. మచిలీపట్నం పోర్టు పనులు మరో ఏడాదిలో పూర్తి కానున్నాయని కనెక్టివిటీ రహదారికి నెలాఖరులోగా అనుమతులు రానున్నట్లు తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం ఆరు లేన్ల రహదారి పనుల డీపీఆర్‌పై చర్చించామన్నారు. రహదారుల విస్తరణపై విజయవాడ నుంచి గోశాల వరకు రహదారి విస్తరణ, గుడివాడలో రహదారి నిర్మాణం తదితర అంశాలపై చర్చించామన్నారు. కత్తిపూడి – ఒంగోలు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించనున్న నేపథ్యంలో లోసరి బ్రిడ్జి నుంచి ఉల్లిపాలెం వరకు సముద్రతీరం వెంట గ్రామాలను కలిపేలా రోడ్డు పనులు చేపట్టడానికి మాట్లాడామని చెప్పారు. పామర్రు – చల్లపల్లి రోడ్డును జాతీయ రహదారిగా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కంకిపాడు – గుడివాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీపై చర్చించామని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులు, మోర్త్ అధికారులతో మంత్రి, ఎంపీ, శాసనసభ్యుల సమావేశం


