చౌకబారు దందా
తనిఖీలు విస్తృతం చేస్తాం
పెడన: పేదలకు అందాల్సిన చౌక బియ్యం పక్క దారి పడుతోంది. అర్ధరాత్రి, వేకువజామున దర్జాగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లాకు మారుమూలన ఉన్న పెడన నియోజకవర్గం నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం ప్రతి నెలా పక్కదారి పడుతున్నా నియంత్రణ చర్యలు చర్యలు కనిపించడం లేదు. కొద్ది నెలలుగా సివిల్ సప్లయీస్ అధికారులు అడపాదడపా దాడులు చేసి బియ్యాన్ని పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.
పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నెలకు 39,469 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వం ప్రతి నెలా ఉచితంగా కార్డుదారులకు సరఫరా చేస్తోంది. కొందరు రేషన్ డీలర్లు, బయట దళారులతో కలిసి బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెడన పట్టణంతో పాటు నాలుగు మండలాల్లో ఈ తరహా అక్రమాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. కార్డుదారుల వద్ద కిలో రూ.10 నుంచి రూ.12 వరకు బియ్యం మాఫియా నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. కొందరు డీలర్లు వినియోగదారుల వద్ద వేలిముద్రలు తీసుకుని బియ్యాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నార్న ఆరోపణలు ఉన్నాయి.
బియ్యం రీసైక్లింగ్
పక్కదారి పడుతున్న బియ్యాన్ని దళారులు ట్రేడింగ్ మిల్లులకు కిలో రూ.18 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ట్రేడింగ్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేస్తూ తిరిగి సివిల్ సప్లయీస్, బహిరంగ మార్కెట్‌లకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంలోనే కాకుండా ఇటీవల కాలంలో కూడా అధికారులు భారీగా బియ్యం నిల్వలను పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే.
ఆ స్టాకు పాయింట్ల ద్వారా తరలింపు
చిన్న చిన్న దళారులు లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ.10 చొప్పున కొనుగోలు చేసి మధ్య దళారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. వీరు ఏకంగా రూ.18 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. వీరి నుంచి అధికంగా ఫంగస్ చేపల పెంపకం దారులు, ఇతర వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఫంగస్ చేపలకు అన్నంగా వండి మేతగా వేస్తున్నారు. మధ్య దళారులు కొన్ని ప్రాంతాలను ప్రత్యేక పాయింట్లుగా ఏర్పాటు చేసు కుని మండలాల సరిహద్దులు దాటించేస్తున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వర్తించే వారి కంట్లో పెడితే వారికి ప్యాకేజీలు అందజేస్తున్నారు. ఆ తరువాత ఎవరైనా ఫిర్యాదులు చేసినా చూసి చూడనట్లు, తెలిసిన బండేనని వదిలేయడం, లేదా వాహనం వెళ్లిపోయిన తరువాత రావడం వంటివి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్లు, మినీ వ్యానుల్లో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సరిహద్దులు దాటిపోతున్న పీడీఎస్ బియ్యం
అర్ధరాత్రి, వేకువ జామునే మండలాల నుంచి దాటింపు
ఫిర్యాదుచేసినా.. అడ్డుకున్నా..
పట్టుకున్నా.. ప్యాకేజీలతో బురిడీ
రేషన్ షాపులపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే పలు చోట్లు తనిఖీలు నిర్వహించాం. పట్టణంలోనే కాకుండా పలు మండలాల్లో కూడా తనిఖీలు నిర్వహించాం. అయితే రాత్రి సమయంలో తరలిస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. తప్పకుండా నిఘా పెడతాం.
– నాగమల్లేశ్వరరావు, సివిల్ సప్లయీస్ డెప్యూటీ తహసీల్దార్
చౌకబారు దందా


