
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు శనివారం విరాళాలను సమర్పించారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సాయి సౌమ్య కామరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సాయి సౌమ్య కామరాజు, యశ్వంత్‌రావు దంపతులు తమ కుమారుడు ఇషాన్ కృష్ణ పేరిట వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష, గోసంరక్షణకు రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.
ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు
హైదరాబాద్‌కు చెందిన మేఘమాల ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, అనుపమ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవస్థానంలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష
విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన డి.శివనాగరాజు, దుర్గారాణి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.