
వర్సిటీ విద్య సమాజానికి ఉపయోగపడాలి
కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ
కోనేరుసెంటర్: విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే వ్యక్తులుగా తయారవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ అన్నారు. కేయూ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంజినీరింగ్‌ను మంచి మార్కులతో పూర్తి చేయడమే కాకుండా, మంచి నడవడికతో పూర్తిచేయడం ముఖ్యమన్నారు. ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు నెల జీతం నలభై వేల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉంటుందని నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వారికి రెండువందల శాతం ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ డీన్ ఆచార్య వైకే సుందర కృష్ణ, పలువురు సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.